పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేవకుమారుఁ జేరి సొరిదిన్ మధురోక్తులఁ దత్ప్రకార మెం
తో వెరవొప్పఁగాఁ దెలిపి తోడ్కొని ముందరఁ దెచ్చి నిల్పినన్.

52


క.

జగతీసురసుతు శశిమణి, జగతిం గూర్చుండఁజేసి సవినయనిర్వ్యా
జగతిం బూజ లొసంగి త్రి, జగతీస్తుతసుందరాంగి చతురత ననియెన్.

53


చ.

సరసీరుహాసనాన్వయనిశాకర నన్ గృప నాదరించి యి
త్తఱి నుపకార మొక్కటి యుదంచితలీల నొనర్చి లోకభా
సుర మగుకీర్తిఁ జెంది సరసుల్ నుతిసేయఁ జెలంగు ముర్విపై
నరయఁ బరోపకారవిమలాత్ములు గారె బుధేంద్రు లెప్పుడున్.

54


తే.

విను ధరామర హరికి విద్వేషి యగుచుఁ, బాపమతి రుక్మి నను శిశుపాలుఁ డనెడు
పరమదౌర్భాగ్యునకు నేఁడు పరిణయంబొ, నర్స నూహించియున్నాఁడు దర్ప మెసఁగ.

55


క.

ఈకుండినపతి శక్తుఁడు, గాకుండినవాఁడు వానిఁ గాదని హరియున్
రాకుండిన నిపు డతనికి, నీకుండినఁ గోర్కు లెల్ల నె ట్లొనఁగూడున్.

56


ఉ.

ఓవసుధాసుధాశనకులోత్తమ చిత్త మహర్నిశింబులున్
బావని యైనకృష్ణపదపంకరుహద్వయిసేవఁ గోరుచుం
గేవలకౌతుకస్ఫురణఁ గేరుచు నున్నది యెన్నిభంగులన్
నీ వరుదెంచి యివ్విధము నేర్పున శౌరికి విన్నవింపవే.

57


క.

భూసురనిరుపమగుణగణ, భాసురఘనరాజహంసపరిచితలీలా
వాసంబు గాక మానస, కాసారం బేక్రియం బ్రకాశత నొందున్.

58


చ.

మెఱయుచు నీలవర్ణమున మీఱి నిరంతరచంద్రికాప్రభా
కరసముదంచితాంబరముఁ గప్పి గభీరతరప్రణాదభా
సురుఁ డగునట్టియాఘనుని సొంపుగఁ దోడ్కొని తెచ్చినప్పుడే
యిరవుగ భూరివృష్టిఁ గురియింతుఁ జుమీ ద్విజముఖ్య యర్మిలిన్.

59


క.

సాక్షులు సు మ్మిత్తామర, సాక్షులు నీకొసఁగుదాన నభిమతము కృపా
వీక్షణమునఁ గన్గొని నీ, వీక్షణమున ద్వారవతికి నేఁగుము విప్రా.

60


శా.

నీకుం జెప్పెడిదేమి భూమిసుర యానీరేజపత్రాక్షుతో
నాకార్యంబు సమస్తముం దెలిపి యానందంబు గావించి య
స్తోకానేకపవాహవాహినులతోఁ దో డ్తెమ్ము పొ మ్మంచుఁ దా
నేకాంతంబునఁ గొన్నిమాట లపుడే యేర్పాటుగాఁ దెల్పినన్.

61


క.

విని బాడబకులతిలకుఁడు, ఘనతరపరితోషహృదయకమలుం డగుచున్
వనితామణిఁ గన్గొని యి, ట్లనియెన్ మృదువచనరచన లలరారంగన్.

62


క.

లలనా సురుచిరతరలీ, లల నానృపుఁ దెత్తు వేయులాగులఁ దెలుపన్
వలెనా మదిఁ దలఁపఁగ నీ, వలె నా కిఁక నాప్త లైనవారలు గలరే.

63