పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గులుకుమిటారిగుబ్బలును గొప్పపిఱుందులు లేఁతనవ్వులుం
గలయలరుక్మిణిం బొగడఁగాఁ దరమే పరమేష్ఠి కేనియున్.

8


ఉ.

సారము ముద్దుఁబల్కు ఘనసారము నిద్దపుమేనితావి కా
సారము నాభిరంధ్రము విసారము తేటమిటారిచూపు శ్రీ
కారము కర్ణయుగ్మము చొకారము నవ్వుమొగంబు షట్పదా
కారము కొప్పు సన్మధువికారము మోవి వధూలలామకున్.

9


క.

కనకంబే మెయివన్నియ, కనకంబే ముక్కు విమలకమలేక్షణకున్
ఘనమే జఘనము మేచక, ఘనమే చకచకల నలరు కచ మంగనకున్.

10


క.

లికుచంబులుగద జనరా, లికుచంబులు తేంట్లు పైఁదలికచంబులు లే
మకరంబులు కెందమ్ములు, మకరంబులు జంఘ లాహిమకరాననకున్.

11


తే.

మంద మానడ నెన్నడుమంద మాన, భంబు కుచపాళి కనకకుంభంబుడంబు
చందమామకుఁ దుల మోముచంద మామ, నోజుతూపులు చూపులు రాజసుతకు.

12


సీ.

తరుణేందుబింబంబుఁ దచ్చంద్రికాతతి నదలించు నాననహాసములను
దంతికుంభంబుఁ దద్గమనంబుల నపహసించు నురోజయానములను
దర్పకాశుగములఁ దచ్ఛరాసనములఁ బూని యోడించు దృగ్భూయుగములఁ
దామరపువ్వులఁ దద్బిసశ్రేణులఁ బరిభవించు వరాంఘ్రిబాహువులను


తే.

శరధివీచులఁ దన్మహాసైకతముల, గదుముఁబొదలువళిత్రయికటితటములఁ
జంపకంబులఁ దన్మృదుసౌరభముల, మొనయునాసాంగవాసనలను వధూటి.

13


క.

ఆకామిని నుద్వాహం, బై కామునిఁ గెల్చి చిరతరానందరసా
స్తోకగతిన్ వసియించుట, నాకాధికసౌఖ్యలీల నలరుట సుమ్మీ.

14


ఉ.

మంచముకోటఁ దేనె యిడుమాడ్కిఁ దనంతనె తానె యిప్పు డా
చంచలనేత్ర నీఁదలఁచి సారయశుం డగుకుండినేశ్వరుం
డంచితిలీలఁ గాంచనమయం బగుశోభనలేఖ యంపి పి
ల్పించినయప్పు డేటికివలెన్ మఱి జా గిఁక నంచు నెంచుచున్.

15


క.

భృత్యులఁ దీర్పరు లైనయ, మాత్యులఁ గన్గొని ప్రమోదమతి నఖిలజన
స్తుత్యముగ మంగళోచిత, కృత్యము లొనరింపుఁ డనినఁ గేరుచు వారున్.

16


క.

పరిపరివిధముల నమరన, గరిగరిమన్ మెఱయుపురి జగన్నుతగతి వా
విరి విరివిగ నలరఁగఁ జే, సిరి సిరి కిర వగుచుఁ గ్రొత్తచెలువు దలిర్పన్.

17


తే.

శిల్పకకళాదలేపకచిత్రకార, రజకమాలికకుంభకారకకువింద
చర్మకారకముఖ్యుల సరిగఁ బిలిచి, వలయు నయ్యైప్రయోజనంబులు ఘటించి.

18


క.

దివ్యము లగుకల్యాణ, ద్రవ్యములుం గూర్చి సముదంబున నిఁకఁ గ
ర్తవ్యం బెయ్యది యనుటయు, భవ్యమతిం బ్రోడ లైనబంధువు లెల్లన్.

19