పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనుచుఁ బెద్దల నదలించి యాడురుక్మి, మాట గాదన కపుడు భీష్మకనృపాలుఁ
డొనర నారాజునకుఁ గన్య నొసఁగఁదలఁచి, యవిరళామోదమానసుఁ డై చెలంగె.

138


క.

అని శౌనకాదిమునులకు, ఘనుఁ డాసూతుండు దెలుపుగతినిఁ బరీక్షి
జ్జనపతికి శుకుఁడు చెప్పిన, విని యవ్వలికథయుఁ దెలియ వినఁగోరుటయున్.

139


మ.

పరుహూతాబ్జభవాచ్యుతార్చికకుదాంభోజాతశీతావనీ
ధరకన్యాకుచకుంభసంభృతసత్కస్తూరికాశాదమే
దురదోరంతరహాని రహీరశరగోదుగ్ధేందురత్నావళీ
శరదభ్రాభ్రధునీసితాభ్రశశభృత్సంశుభ్రగాత్రప్రభా.

140


క.

కనకాచలరుచిరశరా, సన కాకోదరవిభూష సనకాదిసదా
వనకారణగుహకరిముఖ, జనకానుతచరితే దీనజనకార్యరతా.

141


తరల.

సమరభీషణ సత్యభాషణ సారసాహితభూషణా
సమదవారణ చర్మధారణ సంతతాగమకారణా
ప్రమథనాయక భద్రదాయక పద్మలోచనసాయకా
శమనశిక్షక సాధురక్షక శత్రుగర్వవిమోక్షకా.

142


మాలినీ.

సరసగుణకలాపా సర్వలోకప్రదీపా, సురుచిరతరరూపా శోషితాశేషపాపా
పరిహృతసుమచాపా భాసురోగ్రప్రతాపా, నిరుపమహరిరోపా నిత్యసత్యానులాపా.

143


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి
న్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మయ
నామధేయప్రణీతం బైన రుక్మిణీపరిణయం బనుశృంగారప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.