పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఘనకులజాతుఁ గోరుదు రిలం బరులెల్లను సూపమిశ్రితో
దనము భుజింపఁ గోరుదురు తద్దయు శోభనకార్యవేళలన్.

117


క.

అది గావున మామాటలు, హృదయంబున కిష్ట మయ్య నేనిఁ బ్రమోదం
బొదవ విను నీకు సతతా, భ్యుదయపరంపరలు చెందు నుర్వీనాథా.

118


చ.

యదుకులవార్థిచంద్రుఁడు దయాగుణసాంద్రుఁ డమందసుందరా
స్పదుఁ డమఃలప్రతాపుఁడు విశాలయశస్సహితుండు సంతత
త్రిదశగణార్చితుండు వసుదేవతనూజుఁడు కృష్ణుఁ డాతఁడే
మదిఁ బరికింప నీప్రియకుమారిక కాత్మవిభుండు గాఁ దగున్.

119


మ.

వసుధాధీశ్వర యమ్మహాత్మునిప్రభావం బెన్నఁ జిత్రంబు దా
వసుధాభారనివారణార్థముగ మున్ వందారులై భీరులై
వసుదేవాదులు ప్రస్తుతింపఁ గరుణావర్ధిష్ణుఁ డావిష్ణుఁ డీ
వసుదేవాత్మజుఁడై జనించె సుగుణవ్యాపారపారీణతన్.

120


క.

నూతనలీలల నందని, కేతనమునఁ బెరుఁగుచుండి కృష్ణుఁడు కడిమిం
బూతన యనియెడునసురి న, చేతనఁ గావించె భువనచిత్రము గాఁగన్.

121


క.

నికటమున దనుజమాయం, బ్రకటం బగుచుండు టెఱిఁగి పటుబలయుతుఁ డై
శకటం బొకటి ముకుందుఁడు, వికటంబుగఁ గూలఁదన్నె విబుధులు పొగడన్.

122


సీ.

మారుతాసురుఁ ద్రుంచె మద్దులఁ బెకలించెఁ గినిసి వత్సకుఁ జంపెఁ దునిమె బకుని
నఘదానవునిఁ గూల్చె నలరి కాళియు నొంచె దనశిఖి మ్రింగె గోత్రము ధరించె
శంఖచూడునిఁ దేర్చె సాధించె వృషదైత్యుఁ గేశి నణంచె ముగించె వ్యోముఁ
జాణూరుఁ దెగటార్చెఁ జక్కాడెఁ గంసునిఁ దవిలి యొయ్యనఁ గాలయవనుఁ జిదిమె


తే.

నల జరాసంధముఖ్యు లౌఖలులఁ దఱిమె, ద్వారక యనంగ నొకరాజధాని నిలిపె
బాంధవులకెల్ల నిత్యశుభంబు లొసఁగె, మనుజమాత్రుండె దేవకీతనయుఁ డరయ.

123


చ.

సకలబుధానుసారి యగుశౌరికిఁ గన్య నొసంగి భూమినా
యక శుభలీలలన్ వెలయు టందము డెందమునందు నీవు వే
ఱొకనృపసూతికిన్ వికసితోత్సలనేత్ర నొసంగఁ జూచుట
ల్నికటరసాల మొల్లక చలించి ముసిండిఫలంబుఁ గోరుటల్.

124


క.

అని సభ్యు లాడుపలుకులు, తన చెవులకు ములుకు లగుచుఁ దగిలినఁ గోపం
బునఁ గటము లదర నందఱఁ, గనుఁగొని యపు డనియె రుక్మి గర్వోద్ధతుఁ డై.

125


చ.

అవునవు మంచిపెద్దలె బళా నరపాలునిమ్రోల నూరకే
చివుకుల కెందుఁ జొప్పడని చేవలు వెట్టుచు గట్టిపట్టుగాఁ
జెవులకు ముల్కు లై వినఁగఁ జెల్లనిపల్కులు మాటిమాటికిం
దవిలి వచింపఁ జాఁగితిరి దబ్బర లింకను జాలు మానుఁడీ.

126