పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

రుక్మాంగదచరిత్రము

పీఠిక

ఉ.

శ్రీమయపత్త్రముల్ జ[1]డయుఁ జెల్వగు నభ్రతరంగిణీకణ
స్తోమము పుష్పముల్ ఫలము సోముఁడునై పొలు[2]పొంది పార్వతీ
కోమలదేహవల్లిఁ బెనఁగొన్న సమంచితదక్షవాటికా
భీమయదేవకల్పక మభీష్టఫలంబులు మాకు నీవుతన్.

1


చ.

కలశపయోధికన్య మృదుగండమరీచులనీడఁ జూచుచున్
దిలకము కమ్మకస్తురిఁ బ్రదీప్తముగాఁ గొనగోట దిద్దు ను
త్పలదళమేచకద్యుతికదంబశరీరుఁడు మాధవుండు ని
చ్చలుఁ గరుణాకటాక్షముల సన్మతితో మముఁ [3]జూచుఁ గావుతన్.

2


చ.

శ్రుతులు పురాణముల్ మునులు సోమదినేశులు సర్వదేవతా
తతులును జేరి కొల్వఁ బ్రమదంబున భారతి[4]తోడఁ గూడి సం
తతమును లోకసృష్టి విదితంబుగ సంభవ మొందఁజేయు [5]వా
క్పతి పరమేష్ఠి మాకుఁ గలకాల మభీష్టము లిచ్చుఁ గావుతన్.

3
  1. డలు
  2. పొందు; పొందఁ
  3. బ్రోచుఁ
  4. దేవితోడ
  5. నాకృతి