Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయము

తెలంగాణ మాంధ్రప్రదేశముగా నవతరించిన సందర్భమున, తెలంగాణా రచయితలసంఘ మాంధ్ర రచయితల సంఘముగా పరిణమించిన యవసరమున, తెలంగాణా సర్వతోముఖ వికాసమునకు మేలుకొల్పులు పాడిన వైతాళికులగు కీ. శే. శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి “రామాయణ విశేషము"లాంధ్ర భారతికి ప్రథమోపహారముగా సమర్పించుకొనుట మా భాగ్యవిశేషము. తెలుగువారికి సీతారాములు మీద గల భక్తి యపారము రామాయణమన్న చెప్పరాని యభిమానము. కాని భారత భాగవతాదులవలె మనసుకెక్కిన రామాయణ మింతవరకు తెలుగులో నవతరింపలేదు. భాస్కరుండు పదరకున్న మనకు రామాయణము కూడ బండ్లకెక్కి యుండును. ఐనను భారత భాగవత కథలకన్న రామాయణ కథలందే మన కభినివేశము మెండు శిష్టుల కిది వాల్మీకి రామాయణము నుండియు, తదితరులకు జానపద వాఙ్మయమునను దేశి సారస్వతమునను గల వాల్మీకీ యావాల్మీకీయ రామాయణ గాథల వలనను కలిగియుండు ననుకొందును. ఏతదభినివేశమే శ్రీ ప్రతాపరెడ్డిగారిచే రామాయణ గాథా పాథస్సుల లోతు లరయించినది. సార్వపథీనమైన వారి దృష్టి అంతరాంతరముల ప్రవేశించి అమూల్య విశేషములను కనుగొన్నది. అది చక్కని రామాయణము లేని కొఱతను చిక్కని రామాయణ విమర్శనముతో కొంతవరకు తీర్చినది. అందఱ మెప్పింపజాలు కవిత యెట్లసాధ్యమో యందఱి మన్నన నందుకొను విమర్శనముగూడ నటులే దుర్లభము. శ్రీ ప్రతాపరెడ్డిగా రెట్టి నిర్భీకులో, నిల్కల్మషులో వారి విమర్శనము గూడ అటులే నిష్పాక్షికము, సత్యాన్వేషణైక లక్ష్యము. గ్రంథస్థ విషయము గూర్చి కీ. శే. పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారును, కీ. శే. చిదిరెమఠం వీరభద్ర శర్మగారును, శ్రీ అనుముల సుబ్రహ్మణ్య