Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

రామ వాల్మీకుల కాలము

శ్రీరామచంద్రుడు ఈ భరతఖండములో ఎప్పు డుండెనో నిర్ణయించుట మహాకష్టము. అట్టి నిర్ణయ మంతయు ఊహాప్రపంచములో నుండునట్టిది. ఈ విషయములో మనపురాణాలు అంతగా సహాయపడవు. ప్రాచీన మహాపురుషులు, మహర్షులు మానవాతీతులనియు, అద్భుత కార్యములు జేసిరనియు, వేనవేలయేండ్లు జీవించిరనియు పురాణాలలో వ్రాసినారు. శ్రీరాముడు త్రేతాయుగములో నుండెననియు, శ్రీకృష్ణుడు ద్వాపరయుగములో నుండెననియు కొందఱు వ్రాసిరి. ఒక్కొక్క యుగము లక్షల సంవత్సరాల కాలముతో కూడియుండునని పురాణకారులే నిర్ణయించినారు. త్రేతాయుగము 12 లక్షల 96 వేలేండ్ల వరకుండెను. ద్వాపరము 8 లక్షల 64 వేల యేండ్లుండెను. కావున శ్రీరాముడు పౌరాణికుల లెక్కలప్రకారము కలియుగసంవత్సరాలు కలుపుకొని, వారు జీవించిన 11 వేల యేండ్లను కలుపుకొని, త్రేతాయుగము తుదిలోనే యుండెనని తలచినచో ఇప్పటికి కనిష్టము 21,78,000 యేండ్లకు పూర్వుడుగా నుండి యుండవలెను. శ్రీరాముడు పదకొండువేల యేండ్లు జీవించెననుటకు ప్రమాణము.

శ్లో. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షిణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ బాల 15 స. 28 శ్లో.

రాము డిన్ని వేల యేండ్లు బ్రతికినది, ఇన్ని లక్షల యేండ్లకు ముందుండినదియు విశ్వసనీయము కాదు. అతడు శ్రీకృష్ణునికన్న పూర్వికుడని మాత్రము తెలియ వచ్చుచున్నది. చారిత్రక దృష్టితో వీలయినంతవరకు అతని కాలము నిర్ణయించు ప్రయత్నము చేయుదము.