Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

19

వెబర్ అను నతడు రామాయణము క్రీ. శ. 400 లో రచింప బడెనని వ్రాసినాడు. ఎందుకనగా బౌద్ధ జాతక కథలలోని ఒకకథలో సీతారాముల ముచ్చట కలదట. జాతక కథలు బుద్ధుని పూర్వజన్మ కథలు. అవి కల్పితములైనవి. అయినను ఏడవ అవతార పురుషుడయిన రాముడు తొమ్మిదవ అవతారపురుషుడయిన బుద్ధునితర్వాత నుండినట్లు వెబరు వాదించుట హాస్యాస్పదమని విల్లీపండితుడు ఖండించినాడు. ఒకోబీ అను పండితుడు రామాయణములో “యవన" అను పదము మూడుమారులు వచ్చినందున రామాయణము అలెగ్జాండరు దండయాత్రకు తర్వాతికాలపు రచనయై యుండునను సూచనను చేసినాడు. “యవన” పదము అలెగ్జాండరుతో మనదేశములోనికి వచ్చినదని పాశ్చాత్యులెప్పుడును ఒక తప్పుడు వాదము చేయుచుందురు. అలెగ్జాండరుగాని అతని పెద్దలుకాని పుట్టుటకు 2000 ఏండ్లకు పూర్వమే హిందువులు సిరియా, గ్రీకుదేశాలవరకు తమ మతవ్యాప్తి చేసియుండినట్టి వారని ఇదివరకే చూపినాము. కావున పదేపదే అలెగ్జాండరుతో “యవన” పదము యొక్క దిగుమతిని ఆధారము చేసుకొని అపక్వసిద్ధాంతాలను చేయుట అజ్ఞానవిలసనముగా నుండును. ఇట్టి కారణాలనుబట్టి దొంగ యెవరో దొర యెవరో మనకు విశదమగుచున్నది.

వాల్మీకి రామాయణములో విదేశీయవస్తుప్రభావము యొక్క జాడలేవియు కానరావు. భావములలో, సాంఘీకాచారములలో, భూగోళ వర్ణనలలో, పాత్రలపేరులలో, ప్రకృతివర్ణనలలో ఏవియు వైదేశిక లక్షణములు కానరావు. కావున వాల్మీకినుండియే హోమరు తన పురాణమును సృష్టించియుండును. లేదా పరస్పర సంబంధ ముభయులకును లేకుండును.