Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

5

యున్నాడు. అట్టి యితరోపమానములనుబట్టి బహుశా చ్యవనుడు వాల్మీకి తండ్రియై యుండెనేమో అని ప్రబలమగు సంశయము కలుగుచున్నది. చ్యవనుడు కవిత్వవేదిగా నుండియుండును. ఆ కవితయే వాల్మీకిలో పరిణతి పొందినది.

చ్యవనుడును, వాల్మీకియు భృగువంశములోనివారని కొన్ని నిదర్శనములు కలవు. వాల్మీకియే తన రామాయణములో నిట్లు వ్రాసినాడు.


"భార్గవ శ్చ్యవనోనామ హిమవంత ముపాశ్రితః"
                                                -బాల. స. 70. శ్లో. 29.

అయితే ఈ శ్లోకసందర్భము వేరుగా కనబడుచున్నది. ఇక్ష్వాకు వంశములో భరతుని కుమారుడు అసితుడను వాడుండెను. అతడు రామునికన్న 21 తరములు ముందువాడు. అతడు రాజ్యమును పోగొట్టుకొని హిమవంత మందుఁడగా అచ్చటికి చ్యవనుడు వెళ్ళియుండెనను సందర్భములో నుదాహరింపబడినాడు. రామునికన్న 21 తరముల పూర్వ మందుండిన రాజుయొక్క సమకాలికుడగు చ్యవనుడు బుద్ధ ఘోషోదాహృత చ్యవనుడు కానేరడు. ఆ పేరే వహించి వాల్మీకి కాలములో నున్నవా డింకొకడై యుండును.

ఈ సందర్భములో మరొక యంశము చర్చనీయమగుచున్నది

భృగువెవ్వరు ?
"భృగువే శుక్రుడు.[1] శుక్రుడు రాక్షసులకు గురువు. రాక్షసుల కింకొక పేరు అసురులు. వీరినే పారసీకులు అహురులు అనిరి.
  1. శుక్రుడు భృగువంశపు "భార్గవుడు" అని మన పురాణాలు చెప్పుచున్నవి.