Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

3

వాటిని నిరాకరించు నాలోచన చేయరాదు. రాముని చరిత్ర దక్షిణాపథమందలి యార్యవిజృంభణమనిచెప్పి అవలీలగా త్రోసివేయరాదు" అని యతడనెను.

నా అభిప్రాయములో శ్రీరాముడు కల్పిత పురుషుడనుటకు ప్రబలాధారములు కానరావు. రామాయణములోని ప్రధానఘట్టములు జరిగినవనియే విశ్వసింప వీలుకలదు. రాముని ఉత్తమోత్తమ గుణసంపదనుబట్టి హిందువు లతనిని దేవునిగా పూజించుచున్నారు. అందుచేత అతని చరిత్రకు సంబంధించిన విషయాలను మానవాతీతములైనవిగా వర్ణించి పెంచివ్రాసినారు. చారిత్రిక పద్ధతిపై విపులముగా విమర్శచేసిన గ్రంథాలు తక్కువగా నున్నవి. అందుచేత ఈ గ్రంథ రచన అవసరమయ్యెను.

చ్యవన రామాయణము

ప్రధాన విషయములోనికి ప్రవేశించుటకు పూర్వమొక్క యంశాన్ని గూర్చి చెప్పవలసియున్నది. రామాయణములు చాలా యున్నవి. సంస్కృతములో వాల్మీకి రామాయణము తర్వాత రామచరిత్రమును మహాభారతములోను, భాగవతములోను, విష్ణుపురాణములోను, వాయుపురాణములోను వ్రాసియున్నారు. కాళిదాసాదులు శ్రీరాముని గురించిన కావ్యనాటకములను వ్రాసిరి. భారతీయ భాషలలో అనేక రామాయణములు రచింపబడెను. తులసీదాసు రామాయణము హిందీభాషకు మకుటాయమానము. కంబ రామాయణము అరవములో అగ్రస్థానము వహించినట్టిది. తెలుగులో భాస్కరుడు, గోన బుద్ధుడు, మొల్ల, గోపీనాథమువారు, వావిలి కొలనువారు మున్నగు పలువురు వ్రాసిరి. నేటికిని ప్రతిభాషలో రామాయణమును భక్తులు తమశక్తికొలది వచనములోను పాటలలోను పద్యాలలోను నానావిధాలుగా రచించుచున్నారు. వీనికన్నిటికిని మూలము