Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xLii

కాండములోని సీతానసూయా సంవాదఘట్టమువలనఁ దెలియుచున్నది. భారత శాంతిపర్వములోని యాజ్ఞ్యవల్క్య జనక సంవాదములో దైవరాతికి అనగా దేవరాతపుత్రునకు వేదాంతోపదేశము చేయుసందర్భమున నమ్మహర్షి తన పూర్వకథఁ జెప్పుచు- "నీ తండ్రి సభలో వ్యాస వైశం పాయనాదుల యెదుట నాకును విదగ్ధశాకల్యుఁడను వైశంపాయన శిష్యునకును శాస్త్రవాద మతిఘోరముగా జరిగి యందు నేను జయించితి" నని చెప్పినట్లున్నది దైవరాతితండ్రి దేవరాతుఁడేకదా! ఇతఁడే సీతాజనకుఁ డనదగియున్నాడు. కావున యాజ్ఞవల్క్యపుత్రులు రాముని కాలమువారే యనియు నిర్ణయమగుచున్నది. వాసిష్ఠ వైశ్వామిత్రుల కలహము సకల పురాణ ప్రసిద్ధము. యాజ్ఞవల్క్యుఁడు మొదట వైశంపాయనునియొద్దఁ జదివి కారణాంతరమున నతనిచే నిరాకృతుఁడై శుక్ల యజుర్వేదమును సంపాదించిన విషయముగూడఁ బ్రఖ్యాతమైనదే! పై జనక సభావృత్తాంతము బృహదారణ్యకఛాంద్యోగములందును గలదు.

ఇట్టి యనేకవిశేషములు రామకథకు మూలములై మహాభారతము నందందందుఁ గానవచ్చుచున్నవి. వీని నన్నింటిని సేకరించియే తన కావ్యఫక్కి కనురూపముగా మార్చుకొని మహారామాయణమును దత్కర్త రచించియున్నాఁడని గ్రహింపవీలగుచున్నది. కాఁబట్టి రామాయణమెప్పు డెవరిచే నే యుద్దేశమున రచింపఁబడినను నమూలకమైన కల్పితకథ మాత్రము కాదని ఖండితముగాఁ జెప్పవచ్చును.

మహారామాయణ సాహిత్యము నేఁడు రామాయణమను పేరఁ బ్రఖ్యాతమైన మహాకావ్యము. కావ్యదృష్టితోఁ బరీక్షించిన నొకసంస్కృతమునందేకాక మఱియేభాషయందును “నభూతో నభవిష్యతి” అనునట్లు సాటిచెప్పనలవిగాని యసాధారణకావ్యము. కవికులగురువని ప్రసిద్ధి చెందిన కాళిదాసుడు సయితము దీనిశైలి నలవఱచుకొనఁగోరి కొంత ప్రయత్నించెనందురు. కానియతఁడు సైతమీ ప్రయత్నమున లబ్ధమనోరథుఁడయ్యెనని చెప్పజాలము