Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

నాకు ముప్పది యేండ్లనాఁడు (1913) రామాయణాంశములను విమర్శింపుచుఁ జిన్న గ్రంథమును వ్రాయు కుతూహలము కలిగి 'శ్రీరాముని జనన కాలనిర్ణయము', 'దక్షిణదేశమునకుఁ దొలుత వచ్చినవారెవరు?', 'రామాయణ చరిత్ర' అను వ్యాసములను వ్రాసి 'మానవ సేవ' 'ఆంధ్ర భారతి', 'ఆం. సా. పరిషత్పత్రిక' మొదలగువానిలోఁ బ్రచురించితిని. ఆ వ్యాసము పైఁ గొందఱానాడె వ్యతిరేకాభిప్రాయములను సదభిప్రాయములను గూడ సూచింపుచుఁ బత్రికలకు వ్రాసిరి. నాకు వేఱుకార్యములు కల్గుటచే రామాయణ చరిత్రను వ్రాయలేనైతిని. కాని యిపుడు మిత్రులగు శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారు వ్రాసిన “రామాయణ విశేషములు" అను గ్రంథముఁ జదువ నా యభిలాషయు సంపూర్ణముగాఁ దీరినదని సంతసించితిని. కొన్ని యెడల నభిప్రాయభేదములుండుట సహజమె. నేనే వ్రాసినయెడల శ్రీ రెడ్డిగారు వ్రాసిన ప్రాచ్య పాశ్చాత్య పండితులు రామాయణముఁ గూర్చి సంస్కృతాంధ్రేతర భాషలలో వ్రాసిన యంశములను గ్రహింపకుందును. శ్రీ రెడ్డిగారు ఆంధ్రాంగ్ల, సంస్కృత, హిందీ, ఉర్దూ భాషలలో నికరమైన సాహిత్యము కలవారు. నాకు సంస్కృతాంధ్రములే శరణ్యములు. కాన సర్వవిధముల రెడ్డిగారి గ్రంథ ముత్కృష్టమైనదని నా తాత్పర్యము.

నేను 1941 సంవత్సరము అక్టోబరు నెలలో హైద్రాబాదు వెళ్లినపుడు శ్రీ రెడ్డిగారీ గ్రంథములోని కొన్ని యంశములను వినిపించి దీనికిఁ బీఠికను వ్రాయుమనగా యట్లేయని యంగీకరించితినిగాని బహుళ గ్రంథాంశములు గల దీని జూడ నాపీఠిక సరిగా నుండదని తలఁతును. అయిన నాకొలఁదిగ వ్రాయుచున్నాను.