Jump to content

పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 91

గనుగొని వనరుచు రాధా
వనజేక్షణ పలికె వలపు వడ్డికిఁ బాఱన్. 64

మ. చిలుకా యెవ్వతె లేనిచోద లిడి డాచేతం గడం ద్రోయునో
బలిమిన్ రాధికదూత గావె యని కోపావేశతం జూచునో
నలి యాఁకంటికి ఖండచక్కెరలఖాణం బుంచునో యుంచదో
కలలో నంతకుఁ దాళలే వకట నీగారాబ మె ట్లున్నదో. 65

సీ. ఏసాంకవామోద యిఁక రాపు సేయునో
చూడఁజాలక రాజశుకములార
అంబుదాలక యేది యలజళ్ళఁ బెట్టునో
సైరింపలేక హంసంబులార
శరదిందుముఖి యేది విరసంబు చేయునో
నెమ్మి నెమ్మది మాని నెమ్ములార
మించుబోణి యెవర్తు మిఱుమిట్లు గొల్పునో
వైరంబు మీఱ గోర్వంకలార
తే. తేజరిల్లు నిళాండజరాజయాన
కాలరాచును మిము నెల్ల నేలఁ బెట్టి
మిగుల మునురీతి నావెన్క నెగిరిపడఁగ
వలదు మనుఁ డింక సన్మార్గవర్తు లగుచు. 66

తే. కలరవములార యిఁక నొక్కకలికి మిమ్ము
దప్పు లెంచక యాఁకలిదప్పు లెఱిఁగి
సనగ లులవలు నువ్వులు సన్నబియ్య
మునిచి పెంచునొ పెంచదో కనరు చేసి. 67

వ. అని నెచ్చెలులం జూచి యిట్లనియె. 68

సీ. హరిమధ్య యెవ్వతె కరికోఁత బెట్టునో
యదలించి మత్తేభయానలార