పుట:రాధామాధవము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీ రాధామాధవము

ప్రథమాశ్వాసము

శ్రీలావణ్యరసాధిదేవతలు నాఁ జెన్నొందు రాధాదిగో
పాలస్త్రీలఁ బదాఱువేల వివిధప్రాయంబులం గూడి బృం
దాలీలావనకేళి సల్పుతరుణీతత్త్వజ్ఞుఁ గందర్పగో
పాలస్వామి మదీయచిత్తవికచాబ్జస్థాయిఁ గావించెదన్.

1


చ.

పసగల నీకుచద్వయము పాటిగఁజేయ మదీయకుంభముల్
[1]మసలెడు నన్నమాడ్కి మదమత్త[2]మధువ్రతఝంకృతిస్తుతుల్
పొసఁగఁగ డాసి మత్తకరిపోతము లభ్రనదీజలంబులం
బసిఁడిగలంతులం[3] దిడఁ గృపంగొని మెచ్చుసిరిం దలంచెదన్.

2


ఉ.

కైకొని మేల్మిమై నగజఁ గౌఁగిటఁ జేర్చినఁ దక్కుచద్వయీ
కోకయుగంబునన్ దనరు కుంకుమరాగము మేన నెల్లెడన్
సోఁకి నవోదయార్కురుచిసొంపున నొప్పెడికల్పకంబులా
గై కనుపట్టుశంకరుఁ డనర్గళసంపద మాకు నీవుతన్.

3
  1. ససలఁగ అని మూలము.
  2. సక్త అని మూలము.
  3. గలంతులందు = గలంతులతో అందు = తో అనుటకు చూ. దశకుమారచరిత్ర, నన్నెచోడకుమారసంభవము. 2 స్వాగతవృత్తము.