పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హించి దయ న్వచింపుము మహిం జిరకీర్తు లనేకభంగులన్
నించుమటంచుఁ బల్కుటయు నీలమధువ్రతవేణి నేరుపు
ల్మించఁగ నన్నరేశుని లలింగని యిట్లనెఁ బ్రోడజాడలన్.


గీ.

క్షితిప! యిటుల విచారంబు సేయుచుండి | చిన్నమాటలు పలుకంగఁ జెల్ల దిదియుఁ
గాక మత్స్వాంతవృత్తియుఁ గనుఁగొనంగఁ | దలఁచితేనియు వినుము డెందమున నలర.


సీ.

జననాథ విను హరిశ్చంద్రావనీంద్రుండు గాధేయుకొఱకు లోకంబు లెఱుఁగ
ధారుణీభారమంతయు వేఁగఁబోనాడి తనపొలంతిని బుత్రు నొనర నమ్మి
మునుకొని యంత్యజన్మునివెంట మధుమాంసములు మోచుచును వాని గొలుచుచున్న
నంత నవ్విభునిసత్యవ్రతంబున కాత్మఁ గరుణించి నిజభక్తవరదుఁడైన
కాశికావల్లభుఁడు జగత్కారణుండు | విశ్వనాథుండు చండికాధీశ్వరుండు
ప్రేమ సాక్షాత్కరించి యభీష్ట మొసఁగి | కావఁడే వారి నత్యంతకౌతుకమున!


క.

నీవాడినవాక్యం బిపు | డేవిధముననైన నిర్వహించినదానన్
భావజహరణుఁడు గరుణం | బ్రోవఁగలం డాత్మ నలరి భూవరతిలకా!


సీ.

భక్తి విడకయుండు భల్లాణ యివ్వేళ | మది దృఢంబు మీఱ మట్టుపఱచి
సేయుకార్య మిఁకను జింతింపవలవదు | నాకునైనఁ గడువినమ్రగతిని.


సీ.

అన ఘనజఘనఁ గన్గొని యను జనపతి విను వినుతాంగి శోభనత దనర
నీచిత్త మరయంగ నీచందమున నొత్తి చూచితి నిజమది చోద్య మలర
నిరువురహృదయంబు లేకమైయుండినఁ కోర్కె లన్నియు నొనఁగూడఁగలవు
మొనసి ని న్నీవేషమున నొసంగినయప్పు డవ్విటవరుఁడు క్రోధాత్ముఁ డగుచు
వారకామిని దే కిటు లూరిలోన | వరుని నెడబాసి యొంటిమై సరవినున్న
యట్టిమగనాలిఁ దెచ్చి తీ వనుచు నొల్ల | కాజ్ఞ యొనరింపఁగలఁ డమితాగ్రహమున.


క.

కావున ని న్నీరూపము | తో విటశేఖరునికడకుఁ దోడ్కొని చనఁగా
దీవేళ వేశ్యకామిని | వై వేఁగ రమ్మటంచు ననిచిన యంతన్.


క.

అంతిపురి కరిగి యయ్యలి | కుంతలి వెలయింతి యగుటకుం జనుచున్న
న్నంతంగని యెంతేనియు | సంతసమున మల్లికాంబ సవతికి ననియెన్.


మ.

కల్ల ల్గావు నిరాళిఁ గొన్న విటజంగం బంగనం గోరుచో
నుల్లంబెల్లను బల్లవింప నను నీ వొప్పింపకో చల్లమా
భల్లాణక్షితిపాలశేఖరునకుం బట్టంపుఁబూఁబోఁడివై