పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

71


ఉ.

లోలత నీవు నామనసులోపల నెప్పుడు సంచరించఁగా
నాలిజనంబు నిన్నుఁ దమి నచ్చట నచ్చట నుండి వచ్చె నీ
వేళకునంచుఁ బల్కు నవివేకపుమాటకుఁ గోప మేఁటికిన్?
దాళుము సర్వలోకవిదితంబులుగా భవచ్చరిత్రముల్.

33


మ.

కలయం జెక్కుల ఘర్మవారికణముల్ గ్రమ్మంగ నొయ్యారపుం
దళుకు న్నిద్దపుమేనిపై చిటులుగంధం బందమై మించ నూ
ర్పులనెత్తావికి గండుతుమ్మెదలు గుంపుల్ గూడి వెన్నాడఁగా
భళిరా! వచ్చితి వీవు వేగ, రమణీపాంచాల! నాపై దయన్.

34


మ.

నటనల్ జూపెడి యూర్పుదావులు, నలంతల్ చూపు వాల్ చూపులున్
చిటిలుంగుంకుమ క్రొత్తలేఁజెమటయున్ శీర్నాలకశ్రేణియున్
నిటలాలక్ష్యవిశేషకంబుగల యా నీలాలకంబాసి యు
త్కటమోహంబునఁ జేరవచ్చితివి వేగన్ నీవు నాపై దయన్.

35


సీ.

కులుకుగుబ్బల సోఁకు కుంకుమరేఖల
                 మైపూఁతచేతను మాటి నపుడె
గళమునఁ గనుపించు నెలవంకగోరులం
                 గంటసరంబుచేఁ గప్పి నపుడె
జడవ్రేటు మరుపడఁ గడవన్నెబంగారు
                 వలిపెదుప్పటి వల్లె వైచి నపుడె
సందిదండలు యొత్తు జాడల బాహాంగ
                 దముల పూనికచేత దాఁచి నపుడె


గీ.

నేరుపరి వౌదు వన్నింట నీవె జగతి
ముదురుచందురుఁగావి కెమ్మోవిమీఁద
నాఁటనొత్తిన పలుగంటి మాటుపట్ల
మఱపువచ్చిన నది నేరమా? తలంప.

36