పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

17


సీ.

ప్రాణభయంబునఁ బఱచి తల్లడమంది
                 భోగిరాజకులంబు పుట్టలరయ
దళముగా నొక్కట ధరణీభృతాళుల
                 శరవృష్టు లంతట జడిగొనంగ
మిఱుమిట్లు గొన దృష్ట్లు మిడిచి మన్నీలెల్ల
                 బెదరి చేబారలు పెట్టుచుండ
వలగొని దీధితుల్ వరలంగ దొరలెల్ల
                 నురుమని పిడుగంచు నులికిపడఁగ


గీ.

మెఱపు మెఱచిన చాడ్పున మేలిపసిఁడి
పక్కెరను మించు తేజిపై నెక్కి యేలు
చిన్న చెవ్వయ యచ్యుతక్షితివరుండు
సమరనిశ్శంకుఁడని జనుల్ సన్నుతింప.

46


సీ.

సింగముల్ గలవని చింతఁ జెందఁగ నేల
                 తనుమధ్యముల కోడి తలఁకియుండ
గజములు గలవని కళవళింపఁగ నేల
                 కుచకుంభముల కోడి కొంకుచుండ
చమరముల్ గలవని చలన మందఁగ నేల
                 నెఱివేణులకు నోడి వెఱచియుండ
పాములు గలవని భయముఁ జెందఁగ నేల
                 రోమరాజుల కోడి రోఁజుచుండ


గీ.

నద్రి కృత కాద్రికిని సాటి యనుచుఁ దెలిపి
వెఱపుఁ దీర్తురు తమతమ తెఱవలకును
చిన్న చెవ్వయ యచ్యుతక్షితితలేంద్రు
విజయధాటికిఁ బాఱిన వీరవరులు.

47