భావములయొక్క విభావములు మొదలగునంశములు సమాలోచింపఁబడియుండును.
రాఘవన్ పండితులు చెప్పినట్లు భోజునికిఁ బిమ్మట వచ్చినయాలంకారికులలో విలక్షణ మగుభోజుని రససిద్దాంతమును సరిగా బోధపఱచుకొనినవారు బహుస్వల్పము. ప్రకాశవర్షుఁడు, 'సరస్వతీకంఠాభరణము'నకు వ్యాఖ్యలు వ్రాసిన రత్నేశ్వర - జగద్ధర - భట్టనరసింహు లను నుద్ధతప్రకాండు లేతన్మతమును బాగుగ నవగాహనము చేసికొనఁగలిగిరి. అందువలన ప్రకాశవర్షునికృతిలోఁ బ్రధానమగురసప్రకరణము చాలభాగ ముత్సన్న మగుట శోచనీయము.
7. భామహుఁడు - ప్రకాశవర్షుఁడు
ప్రకాశవర్షున కుపజీవ్యు లగు ప్రాచీనాలంకారికులలో భామహుఁ డొకఁడు. భామహుని కావ్యాలంకారమునుండి యీతఁడు కొన్నిశ్లోకములు యథాస్థితములుగాఁ బరిగ్రహించియున్నాఁడు. మఱికొన్ని భామహుని శ్లోకములకు నీతనిశ్లోకములకు విశేషసామ్యము పొడకట్టుచున్నది. 4 వ పరిచ్ఛేదమున (37 శ్లో.) మహ భామహుని దని యొకశ్లోకము నుదాహరించెను. ఇది మనకు లభించిన భామహగ్రంథమునఁ గానరాదు. అం దీశ్లోకము లోపించెనో లేక ప్ర. వ. పొరపాటున మఱియొకకవిరచన నీతని కంటఁగట్టెనో చెప్పఁజాలము. రసార్ణవమున [4 పరి. 41-42 శ్లో. 'ప్రతిబింబమపి', 'రూపం శంసన్తి'] 'రెండుశ్లోకములలో భామహుని మతము ప్రమాణీకరించుకొనఁబడెను. ఈశ్లోకములు గూడ భామహునికృతిలో మృగ్యములు. దీని నాధారముగాఁ గొని వేంకటరామశర్మాగారు మహాభామహుఁ డనునాలంకారికుఁ డొకఁడు గలఁ డనియు, నతఁడు భామహునికంటె భిన్నుఁ డనియుఁ బ్రతిపాదించిరి. కాని యీవాదము సమంజసము కాదని తరువాత నిరూపింపఁబడును. ఇక భామహప్రకాశవర్షులరచనాసామ్యములఁ జూడఁదగును— (అ) ఈక్రిందిశ్లోకము లిరువురగ్రంథములలోను గలవు:
| | 'సముదాయార్థశూన్యం య త్త దపార్థం ప్రచక్షతే.' | |
—భామహ, IV. పరి. 8 శ్లో, ప్రకాశ. 1 పరి. 31.