పైవానిలోఁ గాలవిరుద్ధ మిందు వివరింపఁబడలేదు. కాని 2 వ పరిచ్ఛేదమునందు (85 శ్లో.) ‘దోషః కాలే విరోధోపి న కార్యాన్తర హేతుతః' [కార్యాంతరహేతువులచేఁ గాలవిరోధము దోషముకాదు.] అని చెప్పఁబడియుండుటచేఁ గావలయు మొదటిపరిచ్ఛేదమున నీవివరణము కవిచే వదలఁబడియుండును.
భామహుఁడు 15 దోషములనే పేర్కొనియెను; కాని వానిని పద-వాక్య-వాక్యార్థగతము లని విభజింపలేదు. యుక్తి-ప్రతిజ్ఞావిరుద్ధముల నీతఁ డంగీకరించెను. 'పునరుక్త'దోష మర్థగత మగునప్పుడు 'నేయార్థ' మగు నని యీతఁ డనెను.
దండి యర్థ-శబ్దగతము లగు 10 దోషములనే పేర్కొనెను. యుక్తి(=హేతు)-విరుద్ధ-ప్రతిజ్ఞావిరుద్ధములు గుణములా, కావా యనువిషయమున నాలంకారికుల విప్రతిపత్తిని సూచించియున్నాఁడు.
వాక్యదోషములు 2:-న్యూనము, అధికము. వాక్యార్థగతము లగుచో నివియే- న్యూనోపమ, అధికోపమ- అనుదోషము లగును. వాక్య-వాక్యార్థగతభేదమే తప్ప పై రెండుదోషములకు వ్యత్యాసము లేదు. వాక్యార్థదోషములలో నుపమాదోషములు నాలుగు పేర్కొనఁబడెను. ఇందు న్యూనోపమ, అధికోపమలను దండిభామహు లిరువురు నుదాహరించియుండిరి. అప్రసిద్ధోపమ, విసదృశోపమలను భామహుఁ డొక్కఁడే వివరించియుండెను. దండి వీనిని బేర్కొననే లేదు. ప్రకాశవర్షుఁడు పేర్చొనిన పైయుపమాదోషములు నాలుగింటినే కాక యుపమానము-ఉపమేయములలో లింగ-వచనవ్యత్యాసమువలనఁ గలుగు మఱిరెం డుపమాదోషములు దండిభామహులు నుడివియున్నారు. ఈరెండిటిని ప్రకాశవర్షుఁడు భిన్నలింగ-భిన్నచనము లని నుడివి వీనిని వాక్యదోషములలోఁ జేర్చియున్నాఁడు. 'విపర్యయము' (అసదృశత ?) అను నేడవయుపమాదోషమును భామహుఁ డొక్కఁడే నుడివియున్నాఁడు. తనకంటెఁ బ్రాచీనాలంకారికుఁ డగుమేధావి యీయుపమాభేదముల నేడింటిని బేర్కొనె నని భామహుఁడు వ్రాసియున్నాఁడు.[భామహ. II పరి. 40 శ్లో.]