Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కారములను, (4 వ పరి.) అభ్యంతరము లగునర్థాలంకారములను గూర్చిన చర్చమాత్రము గలదు. పిమ్మట రసప్రకరణముయొక్క యుపసంహారభాగముగల 2 పుటల గ్రంథము మాత్రము లభించినది. కావున బాహ్యాభ్యంతరము లగునుభయాలంకారములు విమర్శించు 5 వ పరి. కూడఁ బూర్తిగా నుత్సన్న మైనదని నిర్ణయింపఁదగును. దీనిని బట్టి రసప్రకరణముననే కాక యలంకారప్రకరణమునఁ గూడ గ్రంథపాత మున్న దనియు, రసార్ణవ మాఱుపరిచ్ఛేదముల గ్రంథ మనియుఁ దేలుచున్నది.

6. రసార్ణవమీమాంస

1 వ పరిచ్ఛేదము [దోషప్రమోషము.]:-

దోషములు 3 విధములు-1. పదదోషములు. 2. వాక్యదోషములు. 8. వాక్యార్థదోషములు. ఇందు పదదోషములు 14 తెగలు.

1. అసాధువు.
2. అనిబద్ధము.
3. కష్టము.
4. క్లిష్టము.
5. అనర్ధకము.
6. అపుష్టార్థము.
7. గూఢార్థము.
8. అప్రతీతము.
9. ససంశయము.
10. నేయార్థము.
11. అసమర్థము.
12. అప్రయోజకము.
13. దేశ్యము.
14. గ్రామ్యము.

ఇందు, కడపటి గ్రామ్యదోషము - i. అసభ్యము. ii. అమంగళము. iii. ఘృణాకరము - అని 3 తరగతులుగా విభజింపఁబడెను.

వాక్యదోషములును 14 :-

1. శబ్దహీనము.
2. క్రమభ్రష్టము.
3. విసంధి.
4. పునరుక్తము.
5. వ్యాకీర్ణము.
6. భిన్నవృత్తము.
7. సంకీర్ణము.
8. గర్భితము.
9. భిన్నలింగము.
10. భిన్నవచనము.
11. ఖంజము.
12. న్యూనము.
13. అధికము.
14. శ్లేషాదిగుణహీనము.

ఇం దాఱవది యగు భిన్నవృత్తము మరల వర్ణభ్రంశము, యతిభ్రంశము నని రెండువిధములు.

గుణములు 3 తరగతులు- 1. శబ్దగుణములు. 2. అర్థగుణములు. 3. ఉభయగుణములు.