ప్రకాశవర్షుఁడు గుర్తించియే యుండును; కాని 'అగ్నిపురాణము'నందు ఔచిత్య ముభయాలంకారములలోఁ జేర్పఁబడినట్టు లీతఁ డౌచిత్యమును శబ్దాలంకారములలోఁ జేర్చియుండెను. క్షేమేంద్రునికంటె [క్రీ.1025–75.] ప్రకాశవర్షుఁ డర్వాచీనుఁడు కావచ్చును.
భోజునికంటె మనకవి నవీనుఁ డనుటకుఁ బైప్రమాణములకంటె బలవత్తర మైనగ్రంథస్థప్రమాణము లభించుచున్నది. కాని 'రసార్ణవము'పై విమర్శల వెలయించిన 'డే', రాఘవన్ మొదలగు పండితు లెవ్వరు నేకారణముననో దీనిని గుర్తింపరైరి:
ఆఢ్యరాజు, సాహసాంకుఁడు ననుప్రాకృతసంసృతభాషాపోషకులగు ప్రభుపుంగవులు, (మహా)భామహుఁడు, బాణుఁడు, వాత్స్యాయనుఁడు ననుగ్రంథకర్తలు, మహేశ్వరుఁడు, స్వయంభువు, వాతవ్యాధి, బృహస్పతి, కౌటిల్యులచే రచింపఁబడిన ‘అర్థశాస్త్రములు', కామందకీయ'నీతిసారము', 'విదగ్ధముఖమండనము'[1] మొదలగు గ్రంథములును 'రసార్ణవము'నఁ బేర్కొనఁబడెను. ఈకృతు లన్నిటిలో 'విదగ్ధముఖమండనము’ నవీనము. ఇది కవిశిక్షాగ్రంథము. దీనికర్త ధర్మదాససూరి యను బౌద్ధసన్న్యాసి. క్రీ. శ. 1298-1809 నడుమనుండిన జినప్రభుఁడు (జయసింహునిశిష్యుఁడు) దీనికి వ్యాఖ్య రచియించెను. అందువలన ధర్మదాససూరి క్రీ. శ. 1190-1210 ప్రాంతముల జీవించి యుండె నని నిర్ణయింపఁజనును.[2] కావున నీతనిగ్రంథమును బేర్కొనిన ప్రకాశవర్షుఁడు క్రీ. శ. 1210 ప్రాంతములకంటె నర్వాచీనుఁ డనిమాత్రము నిర్ణయింపవచ్చును.
5. గ్రంథపరిమాణము
మనకు లభించిన గ్రంథమున 4 పరిచ్ఛేదములు సమగ్రముగను, రసవిచారకమును ముఖ్యము నగు 5 వపరిచ్ఛేద మసమగ్రముగను గలవు. ఈగ్రంథము పంచపరిచ్ఛేదాత్మక మనియే వేంకటరామశర్మగారు