పుట:మ ధు క ల శ మ్.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

బాటులో ఉన్న సౌఖ్యాన్ని అనుభవించడమూ తప్పుకాదే ! గులాబి
పుష్పంలోని లావణ్యం నశిస్తుందనీ, ప్రియురాలి వదనంలోని కాంతి
తగ్గుతుందనీ, మధుపాత్రలో మధువు ఇంకిపోతుందనీ ఎవరికి తెలి
యదు? ఈ సౌఖ్యమూ, ఈ సౌందర్యమూ క్షణికమే కావచ్చును.
అంతమాత్రంచేత, ఆక్షణములోనే వాటిని ఎందుకు అనుభవించ
కూడదు? ఇది కేవలం విషయవాంఛానిమగ్నత కాదు. వివేకీ,
రసపిపాసుపూ, అయిన సత్పురుషుని సౌందర్యోపాసన. గమ్య
స్థానానికి ఇదికూడ ఒక మార్గమేమో!

ఉమరు 'మధువు ' 'పానపాత్ర,' 'ప్రియురాలు,' వంటి మాట
లను వాడినప్పుడు, వాటికి వేదాంతపరమైన గూఢార్థముండి తీరవలె
నని వాదించేవారు కొందరున్నారు. జీవాత్మ పరమాత్మల పరస్పర
సంధానమునుగూర్చిన 'సుఫీ'ల సిద్ధాంతాలనే ఉమరుకూడ తన
కావ్యంలో చేర్చాడని వీరి నమ్మకం.

కాని, 'సుఫీ 'లంటే ఉమరుకు గిట్టదు. వారుకూడా అతని నిరస
నకు గురియైన “డెబ్బదిరెండు శాఖల " లోనివారే. అంతరార్ధంతో
నిమిత్తంలేకుండ, స్పష్టంగా పై కికనుపిస్తున్న అర్థమే సరియైన
దని ఉమరు కావ్యాన్ని పరిశీలించిన పండితులలో అనేకమంది అభి
ప్రాయ పడుతున్నారు.