పరిచయం
★
| "ఆకులందున అణగి మణగీ | |
ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి శ్రీ వీరేశలింగం పంతులుగారు యుగపురుషులు. ఈ ప్రభాతకాలంలోనే శ్రీ గురజాడ అప్పారావుగారి రచనలు నూతన విజ్ఞానభానూదయకాంతులు ప్రసరింపజేశాయి. వీరి రచనలు సంఖ్యలో స్వల్పమే అయినా సాటిలేనివి. కవులకు ఆదర్శమార్గాన్ని చూపించాయి. ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించాయి. భాషలో, భావంలో విప్లవాన్ని సాధించాయి.
నవ్యాంధ్రసాహిత్యానికి యుగకర్త అయిన శ్రీ అప్పారావుగారు 1861 నవంబరు 30వ తేదీన విశాఖజిల్లా రాయవరంగ్రామంలో జన్మించారు. విజయనగరం కాలేజీలో చదివి 1878లో బి. ఎ. పరీక్ష ప్యాసయ్యారు. వీరు చదువుకుంటూన్న రోజుల్లోనే, ఇంగ్లీషులో కవిత్వంవ్రాసి పత్రికల్లో ప్రచురిస్తూండేవారు. పట్టభద్రులు కాకపూర్వమే 1884 లో విజయనగరం కాలేజీలో కొన్నాళ్లు ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాని, అప్పుడు వారికిచ్చే జీతం నెలకు పాతిక రూపాయలుమాత్రమే. ఈ స్వల్పజీతంతో అసంతృప్తి చెంది కాబోలు, తర్వాత కొన్నాళ్ళు డిప్యూటీకలెక్టరు ఆఫీసులో హెడ్‌క్లార్కుగా చేరారు. కాని, విజ్ఞానఖనియైన ఈ మహనీయునికి గుమస్తాగిరి ఎంతకాలం సహిస్తుంది? అయిదారు మాసాల్లోనే ఆ గుమస్తాపనికి స్వస్తి జెప్పి, కాలేజీలో మళ్ళీ లెక్చరరుగా ప్రవేశించారు. జీతంకూడా వందరూపాయలకు పెరిగింది. ఉపాధ్యాయవృత్తిలో ఉన్నంతకాలం జీతపురాళ్ళనే తన జీవిత పరమావధిగా ఎంచుకోక, విద్యార్థుల విజ్ఞాన వికాసాలకు ప్రత్యేకించి కృషి చేస్తూండేవారు. అందువల్లనే విద్యార్థులకు వీరెంతో ప్రీతిపాత్రు లయ్యారు.