పుట:ముకుందవిలాసము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

ముకుందవిలాసము


     దాయ పారంపరీ కల్పితాగ్రహార సమూహ మహిత మహీసుర మహా
     విభవ రక్షణ విచక్షణుఁడును, స్వకీయ సోమపౌత్రతా సార్థీకృత
     చక్రవర్తి లక్షణుండును, శ్రీమత్కేశవస్వామి చరణకమల యుగళ
     భక్తి నిష్ఠాగరిష్ఠుండును, షోడశ మహాదాన చతుష్షష్టి విద్యాపటిష్ఠుండును,
     కేశాదిరాయ రాజవేశ్యా భుజంగ సంగ్రామ ధనంజయాదిగర్భేశ్వరాది
     బిరుద సార్థసమర్థన ధూర్వహ సాహసాంకుండును, తిరుమలరాయ
     మహీశ్వరార్ధాంగ లక్ష్మీవిడంబ మంగాంబా గర్భసుధార్ణవ పూర్ణిమా
     శశాంకుండును, శ్రీమద్విజయలక్ష్మీ సహాయుండును నగు సోమ
     భూపాలరాయుండు నొక్క శుభవాసరంబున సుధర్మా సమాన సభాంత
     రంబునం జింతామణివింత రాణించు మాణిక్య సింహాసనంబున నధ్యాసీ
     నుండగుచు హీరతనుత్రాణహారంబుల నైరావతోచ్చైశ్రవంబుల ననుక
     రించు కరితురంగంబు లెసంగం గార్యచాతుర్య సుపర్వమంత్రులగు
     మంత్రులును, విద్యావిశేష ప్రసిద్ధకవి బుధులగు కవిబుధులును, నారద
     సదృశ గానచర్యులగు గాయక వర్యులును, నాసత్య గుణహృద్యులగు
     వైద్యులును, నప్సరస్సమానతావశ్యలగు వేశ్యలును నాదిగాఁగల
     పరివారంబు పరివేష్టింప సకలవైభవ సాంద్రుండగు దేవేంద్రుని
     సొంపున సంపదల నింపొందుచు. 22


సీ॥ నను నందవరపురాన్వయ పయోనిధి చంద్రుఁ
               గాణాదవంశ విఖ్యాతి సాంద్రు
     నాశ్వలాయనసూత్రు నాత్రేయముని గోత్రు
               సకల విద్వత్కవిప్రకర మిత్రుఁ
     బ్రౌఢలక్ష్మీపతి పండిత సోదర్యు
               బాహట గ్రంథానుభావధుర్యు
      వేదశాస్త్ర వురాణ వివిధ మర్మధురీణు
               వర చతుర్విధ కవిత్వ ప్రవీణు