పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"మారిషస్‌లో తెలుగు తేజం" పుస్తక రచయిత శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ 26-5-56 సంవత్సరంలో కృష్ణాజిల్లాలో జన్మించారు. మాజీమంత్రి, ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సారధి శ్రీ మండలి వెంకట కృష్ణారావు, ప్రభావతీ దేవిగార్ల ప్రథమ పుత్రులు; బి.ఏ. పట్టభద్రులు. సాంఘిక సేవ, సాహితీ పిపాస, సంస్కృతి పట్ల అంతులేని మక్కువ గల శ్రీ బుద్ధ ప్రసాద్ చిన్ననాటి నుంచే రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు. అవనిగడ్డ గాంధీక్షేత్రం, సేవాశ్రమం నిర్వాహకుడుగా, "గాంధీక్షేత్రం" మాస పత్రిక సంపాదకుడిగా గాంధేయ భావ వ్యాప్తికి, సమాజ శ్రేయస్సుకు నిరంతర కృషి చేస్తున్న వ్యక్తి. 1990 డిశెంబర్ లో మారిషస్ లో జరిగిన తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న శ్రీ బుద్ధ ప్రసాద్ మారిషస్ యాత్రానుభవాలను, తెలుగు వారి జీవన విధానం గురించి తెలుగు భాష పట్ల అక్కడి వారికి ఉన్న అభిమానాన్ని ఈ పుస్తకంలో సరళమైన భాషలో కళ్ళకు కట్టినట్లు వివరించారు.