పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



అభినందనలు

శ్రీ మండలి బుద్ద ప్రసాద్ రచించిన ఈ "మారిషస్ తెలుగు తేజం" ఒక విహార యాత్రగా కన్పించినా, విదేశాలలో నివసించుచున్న ఆంధ్రుల జీవనవిధానాలను, పూర్వ జీవితానికి ఈనాడు ఆయా ప్రాంతాలలో వున్న వారి కలయికలలో కలిగిన పరిణామాలు పూసగుచ్చినట్టు వివరించారు.

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో ప్రారంభంకాగా, రెండవ మహాసభలు కౌలాలంపూరులో జయప్రదంగా జరిగితే, ఈ మూడవ మహాసభలు మారిషస్‌లో జరగడంతో అన్నీ చరిత్రే అయిపోయినవి. హైదరాబాదులో జరిగినప్పడు ఏ అపశృతులు లేకుండా మహా జయప్రదంగా జరిగాయి. ప్రపంచ మహాసభలు నిర్వహించటానికి అంతర్జాతీయ తెలుగు సంస్థ ఆవిర్భవించింది.

రెండవ మహాసభ కౌలాలంపూరులో జరుగుతుంటే భారతదేశం నుండి ప్రతినిధులు వెళ్ళే సందర్భాలలో అవకతవకలు జరగడం - ఆంధ్ర ప్రజలలో అపోహలు కలగడం జరిగినా, కౌలాలంపూరులో మహాకోలాహలంగా జరిగినవి. వారి ఆతిధ్యం, వారి కళాఖండాల ప్రదర్శనలు, సమావేశాల నిర్వహణ నిరంతరాయంగా మహావైభవోపేతంగా జరిగినవి. అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు విశ్వ విద్యాలయంలో లీనమై పోయింది.

మూడవ మహాసభలు మారిషస్‌లో జరుగుతున్న సందర్భంలో భిన్న భిన్న పోకడలతో భారతేదేశంలో కొన్ని అవకతవకలు జరిగినా, ఆహ్వనితులను పిలిచి పేరంటానికి రమ్మని, పాస్ పోర్టులు పంపమని కోరి చివరకు మీరు రావద్దని కబురు పంపడం జరిగినా, వెళ్ళిన వారికి మారిషస్‌లో అక్కడి తెలుగు వారు చూపిన ఆదరణ, కళాఖండాల ప్రదర్శన, భోజన బాజనాలలో వైవిధ్యం, పాతస్మృతుల సంస్మరణలు దిగ్విజయంగా జరిగిన వనుటలో సందేహం లేదు.

ఆ విధంగా వస్తుతత్వంలో తెలుగు మహాసభలు ప్రపంచ వ్యాప్తంగా జరగడంలో విజయపరంపరగా సాగినవనే చెప్పాలి.