పుట:మాటా మన్నన.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

సంభాషణ జీవితానందాల్లో గొప్పది. మంచి సంభాషణంత మధురమైనది మరొకటి లేదు. ప్రతి వృత్తిలోనూ అనుభవం గడించదలచేవారు నిత్యావసరమైన సంభాషణా ప్రయోజనాలను ఎందుకు గుర్తించరో ఎరుకపడకున్నది. ఇది అందరి అందుబాటులో నున్నది. కాని చాలామంది ఈ సుఖాన్ని అనుభవించలేకున్నారు. ఇది ఒక బ్రహ్మవిద్యగా భావిస్తారు.

నేను ఆ సభకు వెళ్ళాను, ఈ విందుకు వెళ్ళాను. కాని నోరు మెదపడం చాతకాదు అంటారు. మానవులు స్నేహాన్ని కోరతారు. ఆ స్నేహం వారి సంభాషణా జ్ఞానంవల్లనే నెరవేరుతుంది. మనం ఈ ప్రపంచంలో ఏకాకిగ బ్రతకలేము. కనుక ఇతరులతో పరిచయం పొందగోరుతాం, స్నేహం చేయగోరుతాం. నలుగురితో కలిసి మెలసి వుండటంద్వారా ఆనందింపగోరుతాం. కనుక సంభాషణ ఆనందాన్ని అనుభవించ కోరతారు. కాని ఎట్లా మాట్లాడాలో ఎరుగరు కొందరు.

సంభాషణ అనేది దైవదత్తం కాదు. అది శిల్పం. కనుక అది నేర్చుకుని ఉపయోగించుకొనవచ్చును. స్వభావసిద్ధంగా ఈశక్తి లేని వారు నేర్చుకొని పెంపొందించుకొని ఆనందించవచ్చును.

ఈ పుస్తకం అటువంటివారికి ఉపయోగం కాగలదనే ఉద్దేశంతో కూర్చాను.

ఇటువంటి పుస్తకాలు ఇంగ్లీషులో ఎన్నో వున్నవి:

How to win friends and influence people అనే గ్రంథం అధిక ప్రచారం కలది. దీన్ని చూచినపుడు ఇటువంటి పుస్తకం తెలుగులో అవసర మనుకున్నాను.

ఈలోగా మా అన్నగారు మునిమాణిక్యం నరసింహారావుగారు ‘మంచివాళ్ళూ-మాటతీరూ’ ‘మాట నేర్పరితనం’ అనే పుస్తకాలు వ్రాశారు.

తర్వాత నేను The art of conversation by Betty E. Norris రచించిన పుస్తకాలను చూచాను. వానిని ఆధారంగా చేసుకొని దీన్ని రచించాను.

ఈ రచయిత్రికి కృతజ్ఞతాపూర్వక వందనములు.



ఘంటసాల,
30-4-59

గొర్రెపాటి వెంకటసుబ్బయ్య.