పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

మన్నారుదాసవిలాసము


డంబుల చొక్కటంబై వాటంబులైన కవాటంబులను, హెచ్చుపచ్చల
తీరునం గనుపట్టు రాకట్టునేలలను, మెండుకొను బొండుమల్లెల నుల్లసం
బాడు తెల్లజల్లులను, శ్రీమద్రామాయణాది కథాసంవిధానంబులం
బ్రకటంబు లగుచిత్రపటంబులను, సరిగకుట్టుపనుల గనుపట్టు హోంబట్టు
మేలుకట్టులను, రాజరాజసభాతులిత[1]విలాసంబగు రాజగోపాలవిలా
సంబున యత్నంబునం బరచిన నూత్నరత్నకంబళంబులమీఁదఁ
దద్దయు నొద్దికయగు రతనంపుగద్దియయందుఁ దీరుగా బేరోల
గంబై యొకపడఁతి యడపంబును, నొకమంజువాణి కాళంజియు,
నొకపువ్వుంబోణి పావడయు, నొకబిత్తరి బెత్తంబు, నొకవాలుగంటి
వాలును, ఒకయండజయాన గిండియునుం బూని పరిసరంబునన్
గొలువుసలుప, వామభాగంబున హేమపీఠంబున శతక్రతు శ్రీనివాస
తాతయాచార్యవర్యుండు శ్రీ మద్రామాయణభాగవతభారతార్థంబు
లుపన్యసింపుచునుండ, నాజయలక్ష్మి యనందగు నాజమ్మయు, సంపదల
సొంపలరు చంపకవల్లెమ్మయు నిరుగడల సరస నొరసుక కూర్చుండ,
ప్రఖ్యాతనయులగు తనయులును, సకలగుణపాత్రు లగు పౌత్రులును,
నెమ్మిగల ముమ్మనములును, అతులితాలాపవిజితశారిక లగు కుమారి
కలును, యథోచితప్రదేశంబుల నిండియుండ; మఱియు నాదండ
నిస్తులగుణప్రశస్త యగు కస్తూరెమ్మయు, నతివిశాలనయనాంబుజ
యగు నంబుజవల్లెమ్మయు, ప్రఖ్యాతికీర్తి గల మోహనమూర్తమ్మ
యు, సరసగుణనిష్ణాత యగు కృష్ణాజమ్మయు,ఇల మేలనందగు నలమే
లమ్మయు, నాట్యచాతుర్యవిఖ్యాత యగు సీతమ్మయు, మహనీయతర
రూపరేఖ యగు మదనరేఖమ్మయు, మొదలుగాఁగల కాంతామణులు
సంతసంబున వసంతకేళిక వినుపింప, ముంగల మఱికొంద ఱంగనామ
ణులు రంగురక్తులు మీర సంగీతమేళంబు గావింప సమ్మదమ్మునం
బొదలుచు మఱియు నందు కొంద ఱిందువదనలు [2]మధురరసముం
జిలుకు మంజరియును, మఘవగురుశ్లాఘనీయం బగు రఘునాథా
భ్యుదయంబును, సంగతులం గనుపట్టు చెంగమలవల్లీపరిణయాది నాట
కంబులును, హృద్యంబు లగు గద్యపద్యంబులును, రువారంబు లగు
కైవారంబులును, దండకంబులు తారావళులు మొదలుగాఁ దాము
రచియించిన రసబంధురంబు లగు ప్రబంధంబులును, మన్ననారున కంకి
తంబుగా నెన్నిక మీర నానాట విన్నవించిన విన్నపంబులును,
దండ నుండి వినికి సేయుచు నుండు నయ్యవసరంబున.

15
  1. క. విలాసంబులగు
  2. మధురసమంజిమంజిలుకు