పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

103


సీ.

వేదమంత్రంబుల విప్రు లావేళను
        దెరఁగొప్ప నగ్నిప్రతిష్ఠ సేయ
సరసంబుగా భావమరదు లప్పుడు జేరి
        లాజ లందియ్యంగఁ దేజ మమర
మన్నారుదాసుఁ డామగువచేతను లాజ
        హోమంబు సేయించె నువిదతోడఁ
దనరంగ నగ్నిప్రదక్షిణ మొనరించి
        యింతిపాదంబుఁ దా నెలమిఁ బట్టి


తే.

సప్తపదములు మెట్టించి సతియుఁ దాను
నయిదువతనంబు(నే యో)డ కలరసేయు
నల యరుంధతిదర్శన మాచరించి
పెండ్లిపీటను గూర్చుండి ప్రేమమీర.

52


క.

అం దపుడు వధూవరులకుఁ
బొందుగ (నట) నించి చాల పొలుచు ఫలములన్
డెందంబులోన నెంతయుఁ
జెందిన వేడుకను గురుఁడు సేసలుఁ బెట్టెన్.

53


వ.

మఱియును.

54


సీ.

జననుతుం డగు రాజచంద్రనృపాలుండు
        మన్నెవారలును సామంతవరులు
మహినిఁ బ్రసిద్ధు లౌ మండలాధిపులును
        రహికెక్కు రాజాధిరాజవరులు
పేరుగల్గినయట్టి పెద్దముత్తైదువ
        ల్పొగడొందు నాచార్యపురుషవరులు
అల్లుండు తనయులు హసముదొరల్ మఱి
        హితులు మంత్రులు పురోహితజనంబు


తే.

నాదిగాఁ గల్గు తనవార లందముగను
జేరి రతిమన్మథుల మించుచెలువు గలుగు
దంపతుల కప్పు డెంతయు సొంపుమీర
సేసవెట్టిరి శోభనశ్రీలు చెలఁగ.

55


వ.

తదనంతరంబ.

56