పుట:మధుర గీతికలు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

మధురకవి ప్రశంస


ఆంధ్రసాహిత్యసరస్వతీమంజుమంజీరసింజానముల షులం ఘలలు, పావనగౌతమీవాఃపూరముల ముర్మురధ్వనులు మృదంగ తాళములై సహకరింపగా తొలిసారిగా ఏ సీమనర్తించినవో !

ఆదికవి నన్నపార్యుని పైడిగంటము నుండి తొఱగిపారిన రమ్యాక్షరామృతరసధునుల వింటగా ఏ ఆంధ్రీకృత భారతామ్నాయము రూపులు దిద్దుకొని, విశ్వశ్రేయస్కరమైన ఆంధ్రుల సాహిత్యసంస్కృతి కాలవాలముగా రాజమహేంద్రవర నగరమునకు చిరంతన యశఃకాంతుల నొసంగెనో !

ఆ రాజమందిరము వెయ్యేండ్ల సాహిత్య చరిత్రతో ప్రకాశించు మహా నగరము !

అవిరళజపహోమతత్పరుడైన నన్నయ భట్టారకుని ఆది కవిగా తీర్చిన మహానగరమిది ! శ్రీనాథకవి సార్వభౌమునకు కొన్నాళ్లాశ్రయమిచ్చిన భాగ్యమీ మహానగరమునకు దక్కినది !

అద్యతిదాంధ్ర సాహిత్యమహాయుగప్రవక్త శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారీ నగరి వారసులనుట జగమెఱిగిన సత్యమే కదా !

ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారి కవితా జీవితమునకు ఈ నగరి సాహిత్య సంస్కారములు, ప్రోత్సాహమొసంగినవి !