Jump to content

పుట:మత్స్యపురాణము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

మత్స్యపురాణము నాంధ్రీకరించిన కవి హరిభట్టారకుఁడు. ఇతఁడింతకుమున్ను వరాహపురాణముఁ దెలిగించి కొలిపాక యెఱ్ఱన యను కరణమున కంకితము చేసెను. నరులకుఁ గృతి యిచ్చుటఁ గలిగిన పాపముఁ బరిహరించుకొను తలంపుతో నీతఁడీమత్స్య పురాణమును రచించిన ట్లీక్రిందిపద్యముచే నూహింపఁబడుచున్నది.

సీ. ఆయురారోగ్య నిత్యైశ్వర్యములుగల్లి
            విభవంబుతో ధాత్రి వెలయుకొఱకు
    ధనమునకై నరాధముల సన్నుతిసేయఁ
            బొడమిన పాపముల్ చెడుటకొఱకు
    హృదయంబు లక్ష్మీశపదపంకజములందు
            నిశ్చలవృత్తితో నిలుచుకొఱకు
    రౌరవమ్ములఁ బాసి రయమున వైకుంఠ
            సదనంబునకు వేడ్కఁ జనెడుకొఱకుఁ
గీ. బరమవైష్ణవజనులెల్లఁ బ్రస్తుతింప
    మత్కృతంబయి హరికథామాన్యమగుచు
    నుత్తమంబగు విష్ణుధర్మోత్తరంబు
    రంగనాథున కర్పింతు రాణ మెఱసి.

ఇక్కవి తన ‘కష్టఘంటావధానపరమేశ్వరబిరుద’ మున్నట్లు గ్రంథాంతగద్యమునందుఁ జెప్పుకొనియెను. దీనిచే నాకాలమునం దష్టావధానమే మిగుల నపురూపముగా నున్నట్లు తెలియవచ్చుచున్నది. ఈతనికవిత్వము ధారాశుద్ధి గలిగి మృదుమధురముగా నున్నది. ఈతని కాలమింకను జరిత్రకారులచే సరిగా నిర్ణయింపఁబడలేదు. కానీ యపూర్వమగు గ్రంథోపక్రమమును బట్టి చూడ నీతఁడు మిక్కిలి ప్రాచీనుఁడయినట్లు తోచుచున్నది.