Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హేయకర్మాన్యాయహింసాపరాభవ, కరణంబులును బాలమరణములును
బ్రజ లెఱుంగకుండఁ బ్రథమానశాసన, పాకశాసనుండు లోకగురుఁడు
దండ్రిపోలె మిగులదయతోడఁ గాచుచుఁ, బరఁగ రామవిభుఁడు ధరణి నేలె.

2679


క.

సారాచారోదారుఁడు, వీరేంద్రుఁడు పదునొకొండువేలేండ్లు నిజా
జ్ఞారంభ మొదవ నిత్య, స్మేరయశస్ఫూర్తి నేలె మేదిని యెల్లన్.

2680


క.

ఈరామాయణసంహిత, సారమతిన్ వినిన వ్రాయఁ జదివిన దురితా
పారజలరాశిఁ గడతురు, ధీరులు ధర్మార్థకామదీపితవృత్తిన్.

2681


ఆ.

[1]ఎవ్వఁ డెద్ది గోరి యిక్కథ విను వ్రాయు, నాతఁ డదియ పడయు నర్థితోడ
ననఘధర్మవైభవాయురారోగ్యముల్, గలుగు నొక్కమాత్రఁ జెలఁగి చదువ.

2682


చ.

అమర హుళిక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్నయుద్ధకాం
డముతరువాయి చెప్పెఁ బ్రకటప్రతిభాషణుఁ డప్పలార్యస
త్తమసుతుఁ డయ్యలార్యుఁడు గృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్.

2683


ఉ.

ఆగమసత్యవేద్య దివిజాధిపమానసహృద్య
సంతత
శ్రీగరిమాభిరామ పరుషీభవదాసురభీమ [2]నిస్సర
ద్రాగయతీంద్రసాధ్య వినతత్రిదశాఖిలసాధ్య సుస్థిరా
భోగమహానుభావ బహుభూతిదనిర్మలభావభావనా.

2684


క.

ప్రణమన్మరుదీశశిరో, మణిఘృణివిమలాంబుధౌతమానితచరణా
గణనాతిగగుణశరణా, గణలోకకృతాధికరణ కరుణాభరణా.

2685


మాలిని.

కనకకుధరచాపా కల్పకల్యాణరూపా
వనజనిలయవంద్యా వారిజాతాభినంద్యా
జననవిలయదూరా సర్పనిష్పన్నహారా
మనసిజహరనేత్రా మంగళోద్యచ్చరిత్రా.

2686


గద్యము.

ఇది శ్రీ శాకల్యమల్లకవిరవిరాహు నృసింహావర జాప్పలార్యనందనోభయ
భాషాకవితావిశారద శారదాచరణకమల పరిచరణపరిలీఢమానసాయ్యలార్య
విరచితం బయినశ్రీరామాయణమహాకావ్యంబునందు యుద్ధకాండశేషంబు సర్వం
బు నేకాశ్వాసము.

శ్రీసీతాలక్ష్మణభరతశత్రుఘ్నహనుమత్సమేత
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః

————

  1. ఎవ్వఁ డెద్ది గోరి యెక్కడ విను నాతఁ, డదియ పడయు సందియంబు లేదు
    ననఘధర్మవైభవాప్తులు గలుగును, జగతి నొక్కమాత్రఁ జదువఁగనిన.
  2. వీరసద్రాగ