Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సప్తపర్ణపలాశసర్జరసార్జున, వటసల్లకాశోకకుటజతరువు
లెలమి సొంపార వేదశాస్త్రేతిహాస, పఠనములు రత్నమయదీపభరితరుచులు
వల్కలంబులును హుతపావకము లొప్పఁ గలుగునాశ్రమ మొక్కటి కడఁగి చేసె.

1624


సీ.

వల్లరీవలమానఝల్లరీఝంకార, వల్లకీకలనాదవేల్లితంబు
వరకుహూకంఠీరవస్ఫారకంఠీర, వత్రస్తపథికేభవలయితంబు
శుకశారికారబ్ధసురుచిరశ్రుతితర్క, మూలవచోయుక్తిముఖరితంబు
శింజానమంజీరమంజుగుంజితహంస, సారసోత్సుకసారసారసంబుఁ
బ్రాజ్యమంత్రస్వరయుతదీప్రాజ్యహోమ, ధూమధూసరకేసరద్రుమవిభాగ
మాహుతీరితశిఖిశిఖావ్యాకులంబు, నైనయాశ్రమమండల మది దనర్చె.

1625


క.

భాస్వరవిశాలతరకా, [1]ర్తస్వరతోరణవిరాజితమ్మును ఘనవే
దస్వరముఖరితనభము వి, కస్వరబహువిటపివల్లికాకలితంబున్.

1626


క.

తమలోన సహజ మగువై, రము దక్కి మృగేంద్రకుంజరంబులు శార్దూ
లమృగములు బర్హిణభుజం, గమములు మక్కువలు గలిగి కడు నొప్పారన్.

1627


సీ.

నిక్కి మూఁపులు వంచి ముక్కుపైఁ దనదృష్టి, నిలిపి నిశ్చింతత నెలకొనంగ
జప మంచు నొకపాటినెప మిడి పలుకుచు, జపమాలపూసలు జరపి జరపి
జడలును రుద్రాక్ష లొడలివిభూతియుఁ, బొచ్చె మేమియు లేక యచ్చుపడఁగ
ఘనతపోవ్రతములఁ గడు డస్సి కృతకపు, శ్రమమున మిక్కిలి యమరియున్న
కాలనేమిచేతఁ గమనీయతర మైన, యాశ్రమంబు సూచి యనిసుతుఁడు
యిది మహాద్భుతంబు [2]గద యేవనం బొకొ, యిచట మున్ను గాన మేమియొక్కొ.

1628


క.

ఎక్కడిపాలసముద్రం, బెక్కడియాపసిఁడికొండ యెక్కడివిసినం
బెక్కడిద్రోణమహీధర, మక్కట మార్గంబు దప్పె నతిరభసమునన్.

1629


మ.

అనుమానింపఁగ నేల యీద్విజునిచే నధ్వక్రమం బేర్పడన్
విని యే నేఁగెద నంచు డిగ్గి ఫలముల్ వీక్షించి కాంక్షించి కో
పనశీలుర్ మును లంచు నుగ్రతరశాపత్రస్తుఁ డై మాని య
మ్మునికిం జాఁగి నమస్కరించి పలికెన్ మోదంబు సంధిల్లఁగన్.

1630


ఉ.

మారుతసూతి నేను హనుమంతుఁడ రాముఁడు పంపఁగాఁ బయో
వారిధి కేఁగుచో నొదవె వావిరి యై జలతృష్ణ నాకు నీ
చేరువఁ దోయముల్ గలవె చెప్పుఁడు నావుడు నవ్వి యి ట్లనున్
ధీర కమండలూదకము తృష్ణ సనం దగఁ ద్రావు మేర్పడన్.

1631


వ.

అమృతోపమానంబులు రసవంతంబులు నగుఫలంబు లుపయోగించి యీరా
త్రి యిచ్చట నాసమీపంబున నిద్రాసుఖం బనుభవింపు మేను భూతభవిష్య
ద్వర్తమానంబు లగుమూఁడుకాలంబులు నెఱుంగుదుఁ దపోబలంబున రాఘవు

  1. ర్తస్వరతోరణవరణవిరాజితమును వేద
  2. యేమునివన మొకో, యచట... గాన నేమి