Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మేదురతరాట్టహాసము, రోదసిఁ బగులంగ నట్లు మ్రోఁగుచు ఘంటా
నాదితరథుఁ డగువాఁడు మ, హోదరుఁ డనుయాతుధానుఁ డుర్వీనాథా.

795


తే.

సంజమొగులునిద్దంపుఁగెంజాయమేను, గలుగుతురగరత్నము చిత్రగతుల మెఱయ
వడి మహాశనివడువున వచ్చునన్ని, శాతకుంతహస్తుండు పిశాచరాజు.

796


క.

నిశితత్రిశూలరోచులు, దిశలకు నెసఁగించుమృగపతిసమారూఢుం
ద్రిశిరుఁ డనువానిఁ గంటే, దశకంఠునిసుతుఁడు వీఁడు ధరణీనాథా.

797


ఆ.

ఉరగరాజు కేతనోజ్జ్వలమై వచ్చు, తేరిమీఁద విల్లు దిప్పుచున్న
భూరిమేఘసన్నిభుఁడు గుంభుఁ డనువాఁడు, కుంభకర్ణుపెద్దకొడుకు వీఁడు.

798


క.

ధూమధ్వజలాంఛన మగు, భీమధ్వజ మొప్పుదేరఁ బృథుపరిఘముతో
ధూమలతాయితశిఖివిధ, మై మండెడు నదె నికుంభుఁ డనువాఁ డనికిన్.

799


ఆ.

కేల విల్లు గ్రాలఁ గీలాకరాళాగ్ని, దీప్త మైనపసిఁడితేరు సూతుఁ
డార్చి తోల వచ్చునతఁడు నరాంతకుఁ, డనఁగ ననిఁ బ్రసిద్ధుఁ డయినవాఁడు.

800


క.

తను నానాఘోరమృగా, ననములభూతములు రథము నలుగడఁ గొలువం
దనరునతఁడు దేవాంతకుఁ, డనువీరుఁడు పంక్తికంఠుకనాత్మజుఁ డితఁడున్.

801


క.

మఱియు రథదంతిహయములు, మెఱయుచుఁ గైదువులు వాఁడిమెఱుఁగుల నీనం
దఱుచుగ గర్జిల్లెడునం, దఱు రక్షోనాథువీటఁ దగియెడువీరుల్.

802


సీ.

కీలితస్యందనకింకణీరవములు, ఘననేమినినదంబుఁ గ్రందుకొనఁగ
మహనీయభూషణమణిగణస్ఫూర్తులుఁ, జటులాయుధార్చులు సందడింప
నద్భుతభ్రుకుటిరేఖాభీలలీలయుఁ, [1]గార్ముకోచ్చాలనకగతియు బెరయఁ
జారుమౌక్తికసితచ్ఛత్రచంద్రికయును, గర్వాట్టహాసంబుఁ గలయఁబడఁగఁ
గనకదండప్రచండకేతనము గ్రాలఁ, గాలనిభమూర్తు లయినరకక్కసులనడుమ
[2]వాఁడితేజంబుతో వచ్చువాఁడు లోక, కంటకుం డైనయద్దశకంఠుఁ డధిప.

803


క.

నేఁ డనికిఁ దాన వచ్చిన, వాఁడు మహావీరు లైనవారలతో నీ
వేఁడీమి ఘనశరవృష్టిం, బోఁడిమి దూలంగ నార్చి పుచ్చఁగ వలయున్.

804


చ.

అని విని యమ్మహీరమణుఁ డచ్చెరు వందుచుఁ బంక్తికంధరుం
గనుఁగొని యిట్లనుఁ బ్రభలక్రందున రూప మెఱుంగరానిసూ
ర్యునిగతి నొప్పు తేజమున నుజ్జ్వలుఁ డై యిటు లున్నవాఁ డితం
డనఘచరిత్రుఁ డైన జగ మంతయు నేలెడువాఁడు గాఁ దగున్.

805


క.

అక్కజపువీరు లారయఁ, ద్రిక్కినరక్కసులు వారిదిక్కున ధర్మం
బొక్కటియ లేమి దైవము, చక్కటి యేగతియొ కాని సంగ్రామమునన్.

806
  1. గార్ముకహేలనగతియు
  2. 'వాఁడె తేజంబుతో నిట వచ్చు లోక' అ. ప్ర.