పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

24

ఫకీర్ల రాజధాని మస్తాన్‌ ఘర్‌ నాలుగు దాశాబ్దాల పాటు విరామమెరుగక సాగిన ఫకీర్ల పోరాటానికి మస్తాన్‌ ఘర్‌ ప్రాంతం కేంద్ర స్థానమై దేదీప్యమానంగా వెలిగింది. మస్తాన్‌ పీర్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన మస్తాన్‌ దార్గా, మురీదులైన ఫకీర్లకు పుణ్యక్షేత్రంగా మారింది. అందువలన ఈ ప్రాంతాన్ని మజ్నూషా ఫకీర్ల రాజధానిగాతీర్చదిద్దారు. ఫకీర్లకు మస్తాన్‌ ఘర్‌ పెట్టని కోటగా తయారైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతానికి అసంఖ్యాకంగా ఫకీర్లు వచ్చేవారు.సంవత్సరమంతా నిర్వహించవలసిన కార్యక్రమాలు, సమకూర్చుకోవాల్సిన ఆయుధాలు,పోరాట వీరులకు శిక్షణ తదితర కార్యక్రమాలను ఇక్కడే రూపొందించుకొనడం జరిగేది. 1776 ప్రాంతంలో మజ్నూ షా ఫకీర్‌ ఇక్కడ బలిష్టమైన కోటను నిర్మించారు.

ఈ ప్రాంతంనుంచే కంపెనీ పాలకులను పరాజితులను చేయడానికి తమతో చేతులు కలపాల్సిందిగా నాబోర్‌ మహారాణి భవానికి ఆయన లేఖ రాసారు. అయితే స్వదేశీ పాలకుల నుండి ఎటువంటి అనుకూల స్పందన లభించలేదు. ( "...He even sent an urgent appeal to Rani-Bhabani of Natore to make common cause to drive away the firings. But it evoked no response..." Freedom Movement and Indian Muslims, - Dr. Santimoy Ray ). ప్రతికూల పరిస్థితులున్నా, స్వదేశీపాలకుల నుండి ఎటువంటి చేయూత లభించకున్నామజ్నూ షా చివరి వరకూ ఫిరంగీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు.

చరిత్ర సృష్టించిన పోరు ఫకీర్ల ఉద్యామం 1776 నవంబరు మాసంలో మరొక చరిత్ర సృష్టించింది. బొగ్రా వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మజ్నూ షా అనుచరులను లెఫ్టినెంటు రాబర్ట్‌సన్‌ నాయకత్వంలో కంపెనీ సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. ఆకస్మికంగా శత్రువు వచ్చి పడటంతో విజయమో-వీరస్వర్గమోనంటూ ఫిరంగీల సాయుధ బలగాలను ఫకీర్లు ఎదాుర్కొన్నారు. వీరవిహారం చేస్తున్న ఫకీర్ల ప్రతాపం ముందు రాబర్ట్‌సన్‌ దాళాలు నిలువలేక పోయాయి. ఫకీర్లు పోరుకు సిద్దంగా లేనందున పోరాటం చేస్తూనే వెనక్కి తగ్గి అటవీ ప్రాంతంలోకి క్రమక్రమంగా నిష్క్రమించారు. ఆధునిక ఆయుధాలను కలిగియున్నకంపెనీ బలగాలకు అతి చేరువగా వుండి కూడ కత్తులు, కటాలులాింటి సంప్రదాయక ఆయుధాలతో శత్రువును దరిచేరనీకుండ నిరోధించడంలో ఫకీర్లు విజయం సాధించిన సంఘటన కంపెనీ పాలకులలో కలవరం కలిగించింది. ఈ సంఘటనలో మజ్నూ షా శత్రువును నిరోధిస్తూ, కంపెనీ బలగాలను హతమార్చుతూ తప్పించుకున్నారని లెఫ్టినెంటు రాబర్ట్‌సన్‌, ఫ్రాన్సిస్‌ గ్లాడ్విన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ చారిత్రక సంఘటనలో వందలాది కంపెనీ సాయుధులు హతమయ్యారని లెఫ్టినెంటు రాబర్ట్‌ సన్‌ బొగ్రా కలక్టర్‌కు 1776 నవంబరు 14న రాసిన లేఖలో వివరించాడని శ్రీ శాంతిమోహన్ రాయ్‌ను తన ' ఫ్రీడం మూవ్‌మెంట్ అండ్‌ ఇండియన్‌ ముస్లిమ్స్‌' అను గ్రంధంలో వివరించారు. ఈ సంఘటనతో కంపెనీ సాయుధ బలగాలు ఖంగుతినగా,ఫకీర్లు మాత్రం ద్విగుణీకృత ఉత్సాహంతో కంపెనీ బలగాల మీద విరుచుకుపడ్డారు.