Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 138

నిర్బంధించారు. ఈ చర్యతో మండిపడిన ప్రజలు నగరంలోని కూడలి ప్రాంతంలో సమావేశమై పరిస్థితులను చర్చించి, కమిటీ నిర్ణయాలను అమలుచేయాలని, పికిటింగ్ జరపాలని సంకల్పించారు. ఈ నేపధ్యంలో, పెషావర్ పట్టణంలోని, ఖిస్సాఖ్వాని బజార్లో జరిగిన వీరోచిత పోరాటం క్రమాన్ని పలు గ్రంథాలు, నివేదికలు వెల్లడించాయి. ప్రభుత్వ పత్రికలుగా పేరుపడ్డ ఆంగ్ల పత్రికలు కూడా ఖిస్సాఖ్వానీ బజారులో జరిగిన దుర్మార్గాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించాయి. ఆ కథనాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి.
⁠బ్రిటీష్ ప్రభుత్వ చర్యలు, కాంగ్రెస్ కమిటీ నిర్ణయాలు, నాయకుల అరెస్టులు, నేతల మీద జారీచేసిన అరెస్టు వారెంటుల నేపథ్యంలో ప్రజానీకం ఐచ్చికంగా హర్తాల్ పాటించారు. పెషావర్ పట్టణం పూర్తిగా స్తంభించింది. ప్రజలు తమ నిరసన వెల్లడించారు. కమిటీ నిర్ణయం ప్రకారం సాగాల్సిన పికిటింగ్ కార్యక్రమానికి నిర్దేశించిన కార్యకర్తలను ఉత్సాహపర్చుతూ, కార్యాలయం నుండి పికిటింగ్ ప్రదేశాలకు పంపేటప్పుడు తండోప తండాలుగా ప్రజలు గుమికూడి ఉద్యమకారులకు వీడ్కోలు పలకసాగారు. ఆ సమయంలో ఒక పోలీసు అధికారి సాయుధ పోలీసుల దళంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్దకు వచ్చి, నేతలను అరెస్టు చేయడానికి వారెంట్లు ఉన్నాయన్నాడు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు ఎటువంటి ప్రతిఘటన లేకుండా, ప్రశాంతంగా కార్యాలయం నుండి బయటకు వచ్చి పోలీసుల వాహనంలో కూర్చున్నారు. ప్రజలు నాయకులకు జేజేలు పలుకుతున్నారు. నేతలు కూర్చున్న వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. అలా బయలుదేరిన వాహనాల్లో ఒకదాని టైరు బద్దలు కావటంతో ఆ వాహనం నుండి దిగి మరో వాహనం కోసం అధికారులు ఎదురు చూడసాగారు. ఆ సమయంలో తమకు తాముగా స్టేషన్కు నడిచి రాగలమని, తమకు పోలీసు వాహనాలు అక్కరలేదని నాయకులు ముందుకు సాగారు. అ నాయకుల వెంట పెద్ద సంఖ్యలో ప్రజలూ స్టేషన్ కు నడిచారు. అదంతా పెద్ద ఊరేగింపులా మారింది.
⁠ఈ వాతావరణం పోలీసు అధికారులకు నచ్చలేదు. ప్రజలు కాబూల్ గేటు పోలీసుస్టేషన్ చేరుకున్నారు. పోలీస్టేషన్ గేట్లు మూసి ఉన్నాయి. ప్రజలు, నేతలు వేచి చూస్తుండగా, ఒక అశ్వం మీద అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. అతడ్ని చూసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినదించారు. అందుకు ఆగ్రహించిన అధికారి రుసురుసలాడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ప్రజలు 'ఇంక్విలాబ్ జిందాబాద్', 'మహాత్మాగాంధీకి జై' అని నినాదాలిస్తూ, అక్కడ నుండి వెళ్ళిపోసాగారు. ఆ సమయంలో తిరిగి వెళ్ళిపోతున్న ప్రజల వెనుకవైపు నుండి మూడు సాయుధ పోలీసు శకటాలు ప్రజల మధ్యలోకి ఆకస్మికంగా దూసుకు వచ్చాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ప్రజల మీదకు అతి వేగంగా దూసుకురావటంతో, ప్రజలు చెల్లాచెదురయ్యారు. ఆ తొక్కిసలాటలో సాయుధ శకటాల క్రింద పలువురు నలిగిపోయారు. గాయపడ్డారు. మృతిచెందారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయపడిన వారి ఆర్తనాదాలతో, చనిపోయినవారి బంధువుల రోదనలతో, హాహాకారాలతో ఆ ప్రాంతం రణక్షేత్రంగా గోచరించింది. ఈ రణక్షేత్రంలోని విశేషం ఏమిటంటే అక్కడ పోలీసులు మాత్రమే ఆయుధాలు కలిగి ఉండటం, ఉద్యమకారులు నిరాయుధులుగా సాయుధ పోలీసులకు ఎదురు నిలవడం.