పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దైత్యసంహార! చాల దయయుంచు దయయుంచు
దీనపోషక! నీవె దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష! రక్షించు రక్షించు
భువనరక్షక! నన్నుఁ బ్రోవు బ్రోవు
మారకోటిస్వరూప! మన్నించు మన్నించు
పద్మలోచన! చేయి పట్టు పట్టు
తే. సురవినుత! నేను నీచాటుఁ జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు నాగశయన!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 55

సీ. నీ భక్తులను గనుల్‌ నిండఁ జూచియు రెండు
చేతుల జోహారు సేయువాఁడు
నేర్పుతో నెవరైన నీకథల్‌ చెప్పంగ
వినయమందుచుఁ జాల వినెడువాఁడు
తన గృహంబునకు నీదాసులు రాఁ జూచి
పీటపైఁ గూర్చుండఁ బెట్టువాఁడు
నీ సేవకుల జాతినీతు లెన్నక చాల
దాసోహ మని చేరఁ దలఁచువాఁడు
తే. పరమభక్తుండు ధన్యుండు భానుతేజ!
వానిఁ గనుఁగొన్నఁ బుణ్యంబు వసుధలోన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 56

సీ. పంజరంబునఁ గాకిఁ బట్టి యుంచిన లెస్స
పలుకునే వింతైన చిలుక వలెను?
గార్దభంబును దెచ్చి కళ్లెమింపుగ వేయఁ
దిరుగునే గుఱ్ఱంబు తీరుగాను?