పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86. సీ. సగుణనిర్గుణములు సదసత్తులును నిరా
కారసాకారము ల్గానిదేదొ
క్షేత్రజ్ఞక్షేత్రము ల్జీవజంగంబులు
కారణకార్యము ల్గానిదేదొ
పాపపుణ్యంబులు బంధమోక్షంబులు
జ్ఞానకర్మంబులు గానిదేదొ
క్షరమక్షరంబులు సత్య మసత్యము
ల్ఖండ మఖండము గానిదేదొ
గీ. రాకపోకలఁ జెప్పంగ రానిదేదొ
యదియుఁ గేవలపరిపూర్ణ మనఁ నొప్పు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

87. సీ. వసుధలో నణఁగదు వార్ధిలో మునుఁగదు
గాఢాగ్ని చేత దగ్ధంబుగాదు
గాలుకిఁ గూలదు కరములఁ జిక్కదు
పాషాణములనైనఁ బగిలిపోదు
వానకుఁ దడవదు వడగండ్ల నొవ్వదు
యస్త్రశస్త్రంబుల హతముగాదు
ఎండకు నెండదు నేండ నీడకురాదు
ఘనపాశములనైనఁ గట్టుపడదు
గీ. చలికి వణఁకదు భయముల కులికిపడదు
యచలమై యున్న పరిపూర్ణ మమలచరిత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.