Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆరాక్షసుపట్టణ మె
వ్వారికిఁ దదనుజ్ఞ లేక వైరమునఁ జొరం
గా రాదఁట ప్రద్యుమ్నుఁ డ
వారణఁ దత్పురముఁ జొచ్చువైపు విను మిఁకన్.

26


సీ.

భద్రాఖ్యు డగు నటప్రముఖుఁ డొక్కరుఁడు ము
            న్నరుదెంచి మజ్జనకాధ్వరమున
ననయంబుఁ గూడినమునిసభం దననాట్య
            గరిమచే మెప్పించి వరము గాఁగఁ
దన కవధ్యతయు సప్తద్వీపగమనంబు
            నాకాశగతియు నాట్యములయందు
నెవ్వరిరూపు వహించె వారలయట్లు
            తాను భేదము లేక తనరుటయును


తే.

బడసి యేడుదీవుల నాటపస నెరపుచుఁ
దిరుగుచున్నాఁడు వానిపై దితిసుతునకు
వేడ్కఁ బుట్టంగఁ జెప్పి యవ్వీడు చొరఁగ
ముదలగొను మాతఁడై వచ్చు మదనుఁ డంత.

27


వ.

ఇది నీకుఁ బరమప్రయోజనంబు దీన నుపయోగింపఁ దగిన
యవాంతరకృత్యంబులుఁ దత్తదుపాయంబులు నీవ యెఱుం
గుదు పొమ్ము సురకార్యంబు నిర్వహింపు మని వీడుకొలి
పినం దనమరాళజాలంబుతో జాలపాదవనిత గగనంబున
కెగసి వజ్రపురంబున కభిముఖంబుగాఁ బ్రయాణంబు సలుపు
నప్పుడు ద్వారకానగరబాహ్యప్రదేశంబున వాహ్యాళివిహార
సారస్యంబునం దగిలి యున్న ప్రద్యుమ్నుండు.

28