Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తోడ్కొని చన వేడ్క లిగురొత్తుచిత్తంబున నద్దేవోత్త
ముండు నూత్నగారుత్మతస్తంభసంభృతభేదావలంబిరంభాతరు
విభూషితగోపురపార్శ్వభాగం బగుతత్పురంబు ప్రవేశించి
యుభయపార్శ్వసౌధవీథికాధిరూఢప్రౌఢవిలాసినీకటాక్షనివ
హబహుగుణీకృతమార్గతోరణుం డగుచు వారిజనాభుమం
దిరద్వారంబు చేర నరిగె నతండును నుగ్రసేనవసుదేవ
సంకర్షణగదాక్రూరప్రముఖులతోఁ గక్ష్యాంతరంబులు గడచి
యెదురు వచ్చి తత్ప్రవేశవిధానంబు యథోచితంబుగా నడపి
పరస్పరార్హసంభావనంబు లస్తంభసంభ్రమసంభృతంబు లై
జరగునంతఁ గుశలప్రశ్నంబుఁ గావించిన నద్దివిజనాయకుండు
జనార్దనున కిట్లనియె.

67


తే.

ఇపుడు నీదర్శనం బనియెడుకుశలము
కలిమి ప్రత్యక్షమే చెప్ప వలదు కృష్ణ
యటమటముగాక యట మునుపటికుశలము
నఖిలవిదుఁడ వీ వెఱుఁగనియదియుఁ గలదె.

68


క.

ఐనను నాచేతను వినఁ
గా నభిమత మయ్యెనేని కమలోదర నీ
కే నెఱిఁగించెద విను మవ
ధానముతో మన్మనోవ్యధాభర మెల్లన్.

69


చ.

తపమున వజ్రనాభుఁ డనుదైత్యుఁడు బ్రహ్మఁ బ్రసన్నుఁ జేసి వ
జ్రపురి యనంగ నొక్కనగరంబును మేరువుపొంత మారుతా
తపములకు న్నిజానుమతిఁ దక్కఁ బ్రవేశ మొనర్పరానియ
ట్టిపసఁ దనర్చుదానిని ఘటించి యతం డొసఁగన్ బ్రదీప్తుఁడై.

70


వ.

యథేష్టవైభవోపభోగంబులం బ్రవర్తించుచు.

71