Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వలు గొనుచుండఁ జేరి తగువర్తన నొప్పుచుఁ ద న్నతండు వ
త్సలతయు గారవంబు వెదచల్లెడుమాటల నాదరింపఁగన్.

54


వ.

తదీయరత్నసింహాసనసమీపంబునఁ బ్రవర్తిల్లుచు నల్లన
ప్రసంగంబు దిగిచి సవినయమధురభాషణంబుల ని ట్లనియె.

55


క.

మనబొడ్డనబావులలో
ననుదినముఁ జరించునoచలం దొకహంసాం
గన యేమి చెప్పఁ దండ్రీ
కని విని నే నెందు నెఱుఁగ గని విద్యలకున్.

56


చ.

శుచిముఖి యండ్రు దానిని వచోనిపుణత్వమునందు సత్కథా
రచనలయందు నీతివిదురత్వమునందు బహుశ్రవోవలో
కచణతయందు నెందు సరి గానము దానికి వేయు నేల దా
నిచతురతావిశేషములు నీవ కన న్వలయు న్మహాత్మకా.

57


తే.

అనుడు నాదైత్యపతి తనయనుఁగుఁగూఁతు
మాట లొకముద్దు సేయుచు బోటిఁ బనిచి
యమ్మ రప్పింపవే చూత మమ్మరాళి
ననియె నింతియు రప్పించె హంసి నపుడ.

58


వ.

రప్పించి ముందట నిడుకొని శుచిముఖి నీదువిద్యావిలసనంబు
విన్నవించిన నయ్య వినవలయు నని వేడుక పడుచున్న
వాఁడు శాస్త్రప్రసంగంబు సేయు మనిన నదియును.

59


క.

వీనులకు సుధారసముల
సోనలు వర్షించుమృదులసుస్వరఫణితిం
దా నిట్టట్టు గ్రుక్కక పని
లేనిపునఃపదము లిడక లీల దలిర్పన్.

60