పుట:ప్రబోధచంద్రోదయము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కలికి యొకతె యలకము లలి బలమున్
బలె నలికతలముపయిఁ గడలుకొనన్
గలకల నగియెడు కనుగవతళుకుల్
తళతళ మెఱయఁగఁ దను బలుకుటయున్.

(5-56)

ఇందలి గర్భితకందము

క.

కలికి యొకతె యలకము లలి
బలమున్ బలె నలికతలముపయిఁ గడలుకొనన్
కలకల నగియెడు కనుఁగవ
తళుకుల్ తళతళ మెఱయఁగఁ దను బలుకుటయున్.

దీనివలన నీకవులు చిత్రకవితయందు సామర్థ్యము గలవారని తెలియుచున్నది.

అశ్రుత వ్యాఖ్యాన మాశుకవిత్వంబుం అని 64 పద్యమున ఆశుకవిత్వప్రశంస గలదు. ఇందువలన కావ్యమధ్యమున ఆశుకవితాప్రసక్తి తెచ్చుటచేత వీరు ఆశు, మధుర, చిత్ర, విస్తర కవిత్వములో మధురకవిత (యక్షగానాదులు) తప్ప తక్కినవానియందు నేర్పరులని గ్రహింపవచ్చును.

మంగళమహాశ్రీ వృత్తము

ఈ కావ్యాంతమున (5–117) మంగళమహాశ్రీ వృత్త మున్నది. కావ్యము శ్రీతో ప్రారంభించి మంగళమహాశ్రీ వృత్తముతో సమాప్తముచేయు సంప్రదాయము పూర్వ ముండెడిది.[1] నన్నెచోడమహాకవి తన కుమారసంభవమున నీ సంప్రదాయము ప్రారంభించినాడు. ఆవెనుక శ్రీనాథయుగము తరువాతను నీ సంప్రదాయ ముండెడిది.

  1. దీనిని గూర్చి చూడుడు నాఉదాహరణవాఙ్మయచరిత్ర పుట 47.