పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యబంధలక్షణము

మ.

నలుపక్షంబులు పుచ్ఛముం గలుగు మీనవ్యక్తిఁ గల్పించి త
జ్జలవిక్షేపణపక్షగాక్షరచతుష్కం బాదిమాంత్యాక్షరం
బులుగాఁ బాదచతుష్టయం బిటునటుం బొంకంబుగాఁ బోయిరాఁ
గలబింకంబున నందు వ్రాయ నది సాక్షాన్మత్స్యబంధం బగున్

95

గణికాబంధలక్షణము

మ.

నిటలంబాది కటీతటంబు తుదగా నేర్పొప్ప నాద్యాంఘ్రియుం
బటువక్షోజఘనాక్షరంబు లట సంవాదిత్వ మొందన్ నట
న్నటికాపాణిపదంబులందు నుపనంత్యంబాద్యమై మీఁది కు
ద్భటవృత్తిన్ నటియించునేని గణికాబంధంబు సంధిల్లెడున్

96

ఉపాంగబంధలక్షణము

ఉ.

ఆదిమమాదినాళమున నంతిమమంతిమనాళమందుఁ బై
పాదయుగంబు భస్త్రికిరుప్రక్కలయం దిడి క్రిందినిండిఁ దా
మీఁదికిఁ బల్కినన్ సమత మెప్పు వహింపగ నొప్పువృత్త మా
హ్లాదముఁ బొంగఁజేయుచుఁ జెలంగు నురంగదుపాంగబంధమై

97

ఉపధానబంధలక్షణము

మ.

ఘనకూష్మాండసమంబుగా జమిలిరేఖల్ దీర్చి యెందుండి బ
ల్కిన నేకాకృతిగాఁ గనఁబడెడు పోల్కెంబద్దియం బెద్దియై
ననుద్రేఖలయందు వ్రాయ నది యానందంబు నొందించుదా
ని నభిజ్ఞుం డుపధానబంధమని సంధించుం బ్రబంధంబునన్

98

పేటికాబంధలక్షణము

ఉ.

మూతికి మూఁతకున్ సరిగ ముఖ్యపదంబు లిఖించి దానిత
ర్వాతిపదంబులం జివరవర్ణము లాద్యములంతిమంబులౌ
భాతిని ప్రక్కలన్ నిలుపఁ బ్రాక్చరమైక్యము గల్గి పేటికా
ఖ్యాతిని బొందు బంధమయి గ్రంథములందది గ్రంథిలంబగున్

989

కళాచికా(ఝారీ)బంధలక్షణము

శా.

భృంగారంబున కూర్థ్వరంగము బహిశ్శృంగం బథోరంగమున్
శృంగారించి రనంగ మూఁడడుగులం జిత్రప్లుతిన్ వ్రాయఁగా
బంగారంబునఁ జిత్రభంగి నలరుం బైయంఘ్రి పూర్వాంఘ్రియై
పొంగారుం గన కాలుకాహ్వయమునం బొల్పొందు బంధంబునన్

100

పటీరకుటీర(చందనపాత్రము)బంధలక్షణము

ఉ.

క్రమముగఁ బీఠనాళములఁ బ్రాథమికాంఘ్రి తదుర్థ్వపార్శ్వపా
త్రములను మధ్యమాంఘ్రులు శిరశ్చషకంబున నంతిమాంఘ్రి గూ
రిమి దళుకొంద వ్రాసి తలక్రిందుగఁ బల్కినఁ బల్కవచ్చు సు
చ్చమహిమఁ దెచ్చుఁ గర్త కది సారపటీరకుటీరబంధమై

101

ధూపబంధలక్షణము

ఉ.

మస్తకపాత్రమందుఁ బ్రథమంబగు నంఘ్రి లిఖించి తద్గళ
న్యస్తశుభాక్షరంబ మొదలై తుదయొ తగునట్లు పర్యధో