Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [5-3]

సీ.

కంకణఝణఝణత్కారసంకులముగా
              సుందరీజనము వీచోపు లిడఁగ
నర్హసంగతి నంతరాంతరంబుల మంత్రి
              సామంతహితవీరసమితి గొల్వ
వివిధప్రధానాదివిజయాదినిజగుణ
              ప్రకరంబు ప్రౌఢపాఠకులు సదువ
స్వమహితైశ్వర్యానువాదరూపంబుగాఁ
              జేయెత్తి విబుధు లాశీర్వదింప


తే.

వేత్రధరనిష్ఠురోక్తివైచిత్రు లెసఁగ
నంగ[1]చోళకళింగవంగాదివివిధ
సకలదేశాధిపతులు దర్శనము పడయ
నిండు కొలువుండె మాంధాతృనృపవరుండు.

21

దామరాజు సోమన – భరతము

సీ.

ప్రాకారములయందుఁ బటుగోపురములందుఁ
              ధామ[రమ్యద్వార]సీమలందు
విపణిగృహంబుల వెలయు నాయుధహస్త
              భటులను హితులుగాఁ బ్రౌఢి నిల్పి
రక్షితం బొనరించి రాజబింబద్యుతుల్
              మించికాయుచునున్న మంచివేళ
మహిమ నాప్త[2]బుధైకమధ్యస్థలమునందుఁ
              జెలఁగి రత్నాసనాసీనుఁ డగుచు


ఆ.

నర్తకేళి[లాస్య]నటనాగతులచేత
శాస్త్రసమ్మతముగ జనులకెల్ల
వేడ్క సూపి మఘవవిభవుఁడై కొలువుండ
వలయు విభుఁడు నిఖిలకళలు నెఱిఁగి.

22
  1. క.సింహ
  2. చ.సుబంధు