Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తోరహస్తుకకలంభీలు దుప్పటములు
కటితలంబుల నొప్పుగాఁ గట్టుకొనిరి.

105


అను పద్యము కలదు. ఇది అంగద బసవయ ఇందుమతీకల్యాణములోని పద్యముగ కలదు. ఇందు “షీట్” అను ఇంగ్లీషుపదము కలదు. షీట్ అనగా నేప్ కిన్, క్లాత్ ఆర్ టవల్, ఏ బ్రాడ్ పీస్ ఆఫ్ లినెన్ ఆర్ కాటన్ స్టఫ్ అని ఇంగ్లీషు నిఘంట్వర్థములు. ఇంగ్లీషుపదమును ప్రయోగించిన ఇందుమతీపరిణయమే పదునాఱవశతాబ్ది గ్రంథము కాఁజాలదు. పదునేడవశతాబ్ది గ్రంథము కావచ్చును. అందలి పద్యమును సంకలించిన ప్రబంధరత్నాకరము పదునెన్మిదవశతాబ్ది గ్రంథమగును.

తంజావురు సరస్వతీమహలు గ్రంథాలయములోని “ప్రబంధరత్నాకరము,” కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్కార్యాలయములోని “ఉదాహరణపద్యములు,” — ఈ రెండు సంకలనగ్రంథములలోని అముద్రితగ్రంథపద్యములు ప్రబంధరత్నావళి పేర ప్రకటింపఁబడినవి. అందు ప్రబంధరత్నాకరము తృతీయాశ్వాసమునందలి పెద్ద గ్రంథపాతములోని పద్యములు, చతుర్థాశ్వాసములోని పద్యములు లేవు. అంతేకాదు. ప్రబంధరత్నాకరమునందు అనేకపద్యములకు ఆకరములు లేవు. ఆకరములు లేని పద్యములెల్ల తత్పూర్వాకరములలోని పద్యములుగ ప్రబంధరత్నావళియందు ప్రదర్శింపబడినవి. ఆకరములు లేని పద్యములెల్ల తత్పూర్వాకరములలోని పద్యములు కావు. కొన్ని అగును. కొన్ని కావు. కాని పద్యములు ప్రశ్నార్థకచిహ్నయోగ్యములు. ఆ యీ కారణములవలన, ప్రబంధరత్నాకరము పూర్తిస్వరూపము ప్రత్యక్షమగుటకు తంజావూరిప్రతిని, ప్రత్యంతరమును మేళవించిన ప్రబంధరత్నాకరము ప్రత్యేకగ్రంథము, పరిష్కృతగ్రంథము ఆంధ్రసాహిత్యజిజ్ఞాసువులకు ఆవశ్యకము.

తంజావూరి ప్రతికి నకలు కాగితపుప్రతి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు గ్రంథాలయమునందు కలదు. 13-3-1892 నాటి ప్రత్యంతరము కాగితపుప్రతి నాయొద్ద కలదు. (సాహిత్యసంపద. 1989 పుటలు 256-7) రెండును మేళవించి, ముద్రితములైన ఆకరగ్రంథములను ప్రబంధరత్నావళిని సంప్రదించి, పరిష్కరించినదీ ప్రబంధరత్నాకరము. ఇందు సంకలితములైన అంశములు నూటడెబ్బదియైదు. తొమ్మిదివందలనాలుగు పద్యములు. ఆకరములైన ఉపలబ్ధకృతులివి:

నన్నెచోడుడు (?) — కుమారసంభవము

నన్నయ — భారతము

తిక్కన — భారతము

ఎఱ్ఱన — భారతము, నృసింహపురాణము

మూలఘటిక కేతన — దశకుమారచరిత్ర, ఆంధ్రభాషాభూషణము

మంచన — కేయూరబాహుచరిత్రము

బద్దెన — నీతిశాస్త్రముక్తావళి

అప్పమంత్రి — చారుచర్య

నాచన సోమన — ఉత్తరహరివంశము

భాస్కరాదులు — భాస్కరరామాయణము

రావిపాటి త్రిపురాంతకుడు — త్రిపురాంతకోదాహరణము

శరభాంకుడు — శరభాంకలింగశతకము

శ్రీనాథుడు — శృంగారనైషధము, భీమఖండము, కాశీఖండము

(వల్లభామాత్యుడు) — (క్రీడాభిరామము) వీథినాటకము

బమ్మెర పోతన — భాగవతము

విన్నకోట పెద్దన — కావ్యాలంకారచూడామణి

మడికి సింగన — వాసిష్ఠరామాయణము, పద్మపురాణము

నిశ్శంక కొమ్మన — శివలీలావిలాసము (వీరమాహేశ్వరము)

జక్కన — విక్రమార్కచరిత్ర (సాహసాంకము)

దగ్గుబల్లి దుగ్గన — నాసికేతోపాఖ్యానము

భైరవుడు — శ్రీరంగమాహాత్మ్యము

ఏర్చూరి సింగన — షష్ఠస్కంధము

పిల్లలమఱ్ఱి పినవీరన — శాకుంతలము, జైమిని భారతము

నంది మల్లయ, ఘంట సింగయ — ప్రబోధచంద్రోదయము