మ. |
లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసముఁ జొచ్చి యాడక మనోజాతానలం బారునే.
| 96
|
[విరహభ్రాంతి]
ఉ. |
వారిజ! మీన! కోక! యళివర్గ! సితచ్ఛద! సల్లతావనీ!
మీ రుచిరాస్య మీ నయన మీ కుచ మీ యలకాళి మీ గతిన్
మీ రమణాంగి మత్ప్రియ నమేయగతిన్ విరహాతురాననన్
మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరుఁ గానరే.
| 97
|
పెదపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
చ. |
అలికులమెల్ల వేణియును హంసములెల్లను మందయానముల్
జలజములెల్ల నెమ్మొగము జక్కవలెల్లను జన్నుదోయి యా
పులినములెల్లఁ బెన్ బిఱుఁదు పుష్పములెల్లను మేనివాసనల్
పొలఁతుక నాశ్రయించుకొని పోయె నవన్నియు నన్నివంకలన్.
| 98
|
సీ. |
కురులు వ్రాయుటను గొదమతుమ్మెద లయ్యెఁ
గన్నులు వ్రాయంగఁ గలువ లయ్యె
నధరంబు వ్రాసిన మధురబింబం బయ్యె
గళము వ్రాయుటయును గంబు వయ్యెఁ
జనుఁగవ వ్రాసినఁ జక్రవాకము లయ్యెఁ
జేతులు వ్రాసినఁ జిగురు లయ్యె
నడుము వ్రాయుటయును నవలతయై యొప్పెఁ
బొలుపారఁ గటి వ్రాయఁ బులిన మయ్యెఁ
|
|
ఆ. |
దరుణి తొడలు పాదతలములు వ్రాసినఁ
గరికరములు హల్లకములు నయ్యె
నేమి వ్రాయఁ దలఁచి యేమి వ్రాసితినని
మదనవిభ్రమమున మనుజవిభుఁడు.
| 99
|