పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

 చిలుకలు పెల్లుగాఁగ రొదసేయు, బికంబులు కూయ, షట్పదం
బులు కడు మ్రోయఁ దీవగమి పూయఁగఁ బూవులు తావులీయనిన్
గలిసి విహారమున్ సుమవనంబుల సల్పఁగ నేర నేని తొ
య్యలి, మఱి యీవసంతము నిరర్థకమే ఋతురాజ మయ్యునున్.

45


ఉ.

ఆతపతాప మొక్కదెస, నంగజతాప మింకొకదిక్కునన్
నా తను వేర్చుచున్నయవి నాతిరొ, గంధపు లేతపూతలన్
శీతలమైన నీయెదను జేరిచి తాపము బాపకున్న, నే
రీతిగ నాతరం బగును గ్రీష్మదినంబుల నెల్ల దాటగన్.

46


చ.

జలదము మూసిపెట్టి దివసంబులు రాత్రులఁ జేయుచుండ, లో
పలియడు గించుకేనియును పైకిడనీయని వాన జోరుగా
ఇలఁ బడుచుండ, వెచ్చఁదన మిచ్చెడి యింటను రేపవళ్ళు నిన్
గలిసి సుఖింపగా మదిని గాంక్ష జనించెను గామినీమణీ.

47


ఉ.

నీరదపంక్తిలేమిని వినిర్మలమౌ గగణస్థలంబునన్
శారదపూర్ణచంద్రముఁడు చల్లెడి చల్లని చంద్రికల్ భవత్
స్మేరముచే నిరర్ధకత చెందుచునుండఁగ, నిన్ను గూఁడి యిం
పార సుభాంగి, వెన్నెలబయిళ్ళ సుఖించుట యింద్రభోగమే.

48


ఉ.

ఇంతయు సందు లేక బిగియించిన గాఢపుకౌగలింతలన్
సంతస మీవు నా కొసఁగ సమ్మతిలన్ వలె నట్లు కానిచో,
కాంతరొ మంచుచే వడఁకు గల్గగ చేసెడి దీర్ఘమైన హే
మంతపురాత్రులం గడప మార్గము లేదు మఱేది యేనియున్.

49


చ.

కుటిలశీరోజ, దిట్టమగు కుంకుమచర్చలచేత రక్తిమన్
దిటముగఁ బూనినట్టి భవదీయకుచద్వితయంబు ఱొమ్ముకుం
పటులవిధాన కట్టుకొని, మానునొ యీశిశిరంబునందు హృ
త్పుటముననుండి పుట్టు చలి పోవునె యిందుకే పాటుపడ్డటున్.

50