పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

విపులము గాఁగ కుచ్చెళులు వీచులమచ్చున తోచుచుండ పైఁ
టపరికిణీని కట్టుకొని, దగ్గఱపింజలు కల్గినట్టి స
న్నపుతెలిరైకయుం దొడిగి, నాడెపుగుమ్మట మట్లు నీవు నా
కెపుడును దోఁచుచుందువుగదే జగదేకవిలాసినీమణీ.

27


ఉ.

జాఱుగ కేశముల్ ముడిచి చక్కనిదొక్కగులాబిపువ్వు పై
జేరిచి, బాగుగా చలువచేసిన తెల్లనిచీర కట్టి, క
బ్బారవికన్ ధరించి, మెయి భారపుసొమ్ములు లేని నీదు సిం
గారము కన్నవారలకు కన్నులపండుగ కన్నెమిన్నరో.

28


చ.

వదులుగ నల్లినట్టిజడ, వంగి మొగంబున మూఁగుముంగురుల్
నుదుటి సిలాయిచుక్కయు, కనుగవ కాటుకరేఖ, సన్నవై
పొదలెడి తెల్లపుట్టమును పుక్కిటవీడెముచేత నెఱ్ఱనౌ
పెదవియు, నీకు పెట్టియును బెట్టనిసొమ్ములు కావె కొమ్మరో.

29


ఉ.

బాపురె! నీ మొగంబునకు పౌడరు చల్లుట యేల? సబ్బుతో
రాపిడి యేల మేని? కధరంబునకుం దములంపుఁ గెంజగిం
దోపగ జేయ నేల? కనుదోయికి కాటుక యేటి? కో పడం
తీ! పునరుక్తిదోషమున కివ్వి యుదాహరణంబు లౌఁ జుమీ.

30


చ.

దిటముగ నల్లి గుండ్రముగ దీర్చిన కీల్జడ యొక్కమారు, వ్రేల్
జట యొకమాఱు, గుత్తమగు జార్ముడి యింకొకమాఱు, మేలిము
చ్చటముడి యొక్కమారు, కడుచక్కనియొస్సిగ యొక్కమారుగా
కుటిలకచా, భవత్కచము గూర్తువు నామది చిక్కు పొందగన్.

31


చ.

విరియని మల్లెమొగ్గ లొకవేళను, వీడిన యిట్టిసంపెఁగల్
మఱియొకవేళ, చక్కలిగులాబులు వేరొకవేళ, గేదగుల్
మఱియొకవేళ గాఁగ కుసుమంబులు వేణిని దాల్చి పువ్వుబోఁ
డిరొ, పువువిల్తునారసము ఠేవను నాఁటెదు నామనంబునన్.

32