పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

చంద్రరేఖావిలాపము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరహితగేహ! చంద్రీ
వారవధూమదనసదనవర్ధితసుఖరో
గారూఢితమృదుదేహవ
నీరంగవిహారసాంద్ర! నీలనరేంద్రా!

1


వ.

ఆకర్ణింపుము తావకీనకథావిధానంబు యథార్థంబుగాఁ
దొల్లి శ్రీ శివబ్రాహ్మణవర్ణాగ్రగణ్యుం డైన వీరభద్రభట్టారునకు శ్రీ
మద్వైఖానసవంశోత్తముం డగు నంబి నరసింహాచార్యుం డవ్వలి కథ
యిట్లని చెప్పందొడంగె.

2


క.

అక్కమలేక్షణ యది గని
చిక్కెంబో వీడు నాదు చేతి క టంచున్‌
నిక్కుచుఁ దల్లికడకుఁ జని
మక్కువ నక్కథ యెఱుంగ మఱువునఁ దెలుపన్‌.

3


వ.

ఇట్లు దెలుప వేంకటసాని యిట్లనియె.

4


క.

నీ తండ్రి క్రతువు కనుఁగొన
నాతతగతి నీలనృపతి యరుదెంచి నినున్‌
రాతిరి గని మోహించుట
లాతులలోఁ దేనె పుట్టిన ట్లయ్యె గదే.

5


క.

ఏ మేమి! నీలభూపతి
నీమీఁదం గన్ను వైచి నిష్టురజవవ
త్కామశరజాలనిర్దళి
తామేయస్వాంతుఁ డయ్యెనా? మేలుభళీ!

6