పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుక్కాని

ధనార్జనార్థమును బాండిత్యప్రకటనార్థమును బహుదేశాటనముం జేసి రాజసంస్థానములలో సత్కారముల నంది కీర్తిశేషుఁ డైన కూచిమంచి జగ్గకవి యొకప్పుడు విజయనగరమునకుఁ జని విజయనగరసంస్థానాధిపతు లగు శ్రీ పూసపాటి విజయరామరాజుగారి చెల్లెలి పెనిమిటి యగు చింతలపాటి నీలాద్రిరాజు నాశ్రయింపఁగా నాతఁడు తా నుంచుకొనిన వేశ్యను నాయిఁకఁగా జేసి తనమీఁద ప్రబంధము రచింపు మని కోరఁగా జగ్గకవి యందుట కియ్యకొని చంద్రరేఖావిలాస మను శృంగారకావ్యమును రచించుటయు నంతలో నాడిమళ్ళ వేంకటశాస్త్రి సంస్కృతకావ్య మొండు రచించి యిచ్చెద నని చెప్పి జగ్గకవి కావ్యమును నిరసించులటులఁ బ్రోత్సాహించి నీలాద్రిరాజు మతిని మరలించుట వలన నా నీలాద్రిరాజు జగ్గకవికిఁ దగిన బహుమాన మిచ్చి సత్కరింపక తిరస్కారమును గనఁబరచుటయు నందువలన జగ్గకవి తాను రచియించిన చంద్రరేఖావిలాసమును చింపివైచి చంద్రరేఖావిలాపం బను నీ హాస్యరసప్రబంధమును రచించుటయు దటస్థమైనది. అనంతర మీ జగ్గకవి హైదరాబాదునకుఁ బోయి తురకదొరల నాశ్రయించి వారికిఁ దన పాండత్యప్రతిభను జూపి వారి దయను సంపాదించి వారి సామంతరాజ్య మైన విజయనగరమునకుఁ బ్రభుఁడగు శ్రీ విజయరామరాజుగారివద్దకుఁ దన గ్రంథమును నీలాద్రిరాజు సమ్ముఖంబున సభలోఁ జదివించునటుల నవాబుగారివద్దనుండి ఫర్మానా తెచ్చి య ట్లొనర్చె నని జనశ్రుతి గలదు.

ఈ జగ్గకవి యిరువది సంవత్సరములు వచ్చునంతదనుక చదు వెఱుఁగక పలుగాకివలెఁ దిరుగుచుఁ గాలము గడుపుచుండె ననియు, కందరాడవాస్తవ్యుఁ డై బహుళప్రబంధకర్త యై పీఠికాపురప్రభు వగు